మొన్నీమధ్య ఓ సినిమా ట్రైలర్‌లో ‘శివయ్యా..’ అంటూ హీరో అంటే పెద్ద చర్చే జరిగింది. ఏకంగా ఆ సీన్ తీసేసేవరకు వెళ్లింది. అంటే సీరియస్ కంటెంట్‌ను జోక్‌లా చెప్పారు అని ఆ ఓ హీరో హర్టయ్యారు అని అర్థమైంది. ఇప్పుడు అదే డైలాగ్ పట్టుకుని అదే కుటుంబానికి చెందిన మరో హీరో ఎమోషనల్ స్పీచ్‌తో అదరగొట్టేశాడు. కావాల్సినన్ని సెటైర్లు వేసి మరీ ర్యాగింగ్ చేశాడు. ఈ విషయం అర్థమవ్వాల్సిన వారికి బాగానే అర్థమై ఉంటుంది. సెటైర్లు వేసిన హీరో మంచు మనోజ్ (Manchu Manoj) అని మీకు ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు అనుకుంటున్నాం. ‘భైరవం’ (Bhairavam) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగింది ఇదంతా.
తాను తెరపై కనిపించి తొమ్మిదేళ్లు అయిందని, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దర్శకుడి రుణం తీర్చుకోలేను అని మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ తొమ్మిదేళ్ల గ్యాప్ కొన్ని సినిమాలు మొదలుపెట్టాననని, వ్యక్తిగత కారణాల వల్ల ఆపేశానని చెప్పాడు మనోజ్. తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని, 11 నెలల వయసు ఉన్నప్పుడు ‘గృహప్రవేశం’ సినిమాలో నటించానని గుర్తు చేశాడు. 9 ఏళ్ల నుండి ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని, నేనేం మీకు డబ్బు ఇవ్వలేదు, మీ కోసం ఏమీ చేయలేదు. అయినా నా పై ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో నా కోసం మెసేజ్‌లు పెడుతున్నారు అని మరోసారి ఎమోషనల్ అయ్యాడు మనోజ్.
సొంతవాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఈ గుండె ఇంత ధైర్యంగా ఉందంటే అది మీ వల్లే. నాకు భార్య, ఇద్దరు పిల్లలు తప్ప కుటుంబం లేదు. ఈ రోజు వాళ్లు అడిగితే ‘ఇదిగో నా పెద్ద కుటుంబం’ అని మిమ్మల్ని చూపిస్తాను. నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు. ఈ రోజు నాకింత ప్రేమ దొరికింది అంటూ అభిమానులను ఉద్దేశించి మనోజ్ థ్యాంక్స్ చెప్పాడు. శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో, మీ రూపంలోనో వస్తాడు అని అన్నాడు మనోజ్.
ఈ మధ్య కాలంలో తన కుటుంబంలో ఎన్నో జరిగాయని, కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారని, నేను ఊరు వెళ్లొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్నీ రోడ్డు మీద పెట్టారని, బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారని మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఇంటి బయట 20 కార్లు పెట్టించాడని మనోజ్ భావోద్వేగంతో మాట్లాడాడు. నన్ను ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మీద కోపం రావడం లేదు. నా కట్టె కాలే వరకూ నేను మోహన్‌బాబు (Mohan Babu) కుమారుడినే అని చెప్పాడు మనోజ్.
శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు.. #ManchuManoj pic.twitter.com/8hv2LuCqBs
— Filmy Focus (@FilmyFocus) May 18, 2025