టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి ఘటనపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారి కుటుంబాన్ని మంచు మనోజ్ పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ సర్కార్ ను కోరారు. చిన్నారి తల్లిదండ్రులతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని చెబుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు. మనం ఆడవాళ్లను, పిల్లలను ఎలా గౌరవించాలో నేర్పిస్తూ ఉండాలని మనోజ్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి ఆరు రోజులైందని ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియడం లేదని మనోజ్ పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది ఆ రాక్షసుడిని పట్టుకోవడానికి శ్రమిస్తోందని విన్నానని సీఐతో తాను రెగ్యులర్ గా టచ్ లో ఉన్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో 24 గంటల్లో కఠినంగా శిక్షించాలని మనోజ్ కోరారు. ఈ ఘటనను హైలెట్ చేసి చూపించాలని మంచు మనోజ్ మీడియాకు సూచించారు. గతంలో దిశ ఘటనలో న్యాయం జరిగిందని ఈ ఘటనలో కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. చిన్నారి లేని లోటును ఎవరూ తీర్చలేరని పాపకు న్యాయం జరిగే వరకు పోరాడతానని మనోజ్ వెల్లడించారు.
చిన్నారి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని మనోజ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని మంచు మనోజ్ అన్నారు. ఛత్తీస్ గఢ్ లో మూడున్నర సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరగగా ఏడాది తర్వాత ఉరి వేయాలని తీర్పు వచ్చిందని మనోజ్ వెల్లడించారు.