మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సినిమా స్టూడియో కడతానని ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని చెప్పుకొచ్చారు. ఇటీవల సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిశారని మరో ముగ్గురు హీరోలతో పాటు నాన్నగారికి కూడా ఆ సమయంలో ఆహ్వానం పంపారని విష్ణు అన్నారు.
అయితే నాన్నకు ఆ ఆహ్వానాన్ని అందకుండా చేశారని అలా ఎవరు చేశారో తనకు తెలుసని విష్ణు చెప్పుకొచ్చారు. నాన్నకు ఆహ్వానం అందకపోవడం గురించి కూడా తాను చర్చిస్తానని విష్ణు కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు నాన్నతో పేర్ని నాని భేటీ గురించి తప్పుగా ప్రచారం చేశారని విష్ణు వెల్లడించారు. పేర్ని నాని గారు ఫ్యామిలీ ఫంక్షన్ కు వచ్చిన సమయంలో నాన్న ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఆహ్వానించారని విష్ణు తెలిపారు.
ఆ సమయంలో టికెట్ రేట్లకు సంబంధించిన విషయాలను, చాలా విషయాలను మాట్లాడుకున్నామని విష్ణు అన్నారు. టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేస్తుండటంతో థ్యాంక్స్ అని పెట్టానని అయితే కొన్ని మీడియా సంస్థలు తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవ పట్టించాయని విష్ణు వెల్లడించారు. జగన్ అన్నతో వ్యక్తిగత విషయాలను ఎక్కువగా మాట్లాడానని విష్ణు అన్నారు. ఇండస్ట్రీ గురించి కూడా తాను జగన్ అన్నతో మాట్లాడానని అయితే ఆ విషయాలను ఈ వేదికగా చెప్పనని విష్ణు వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ అని ఏదైనా సమస్య వస్తే కలిసి మాట్లాడుకుంటామని విష్ణు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నెలకొన్న వివాదాల వల్లే తనకు ఆహ్వానం అందలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని విష్ణు కామెంట్లు చేశారు. విష్ణు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.