మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారు ఒక్కొక్కరిగా మీటింగ్ లు పెడుతున్నారు. తాజాగా మంచు విష్ణు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘మా’ పుట్టి పాతిక సంవత్సరాలైందని.. ఎందరో కళాకారులకు అన్నం పెట్టిందని.. ఇప్పటికీ పెడుతూనే ఉందని అన్నారు. తెరపై చూసినట్లు సినిమా నటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది అనుకుంటారని.. కానీ మేకప్ తీసి ఇంటికి వచ్చిన తరువాత మేము కూడా మీలాగే జీవిస్తామని అన్నారు.
ఒక నటుడికి ఏడాది మొత్తం పని ఉండొచ్చు.. వచ్చే ఏడాది కనీసం మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు.. నటుడి కష్టాలు, ఆవేదన అతడికే తెలుస్తుందని అన్నారు. ఆర్టిస్ట్ ల కోసం మా అందరి కోసం ‘మా’ ఉందని అన్నారు. ‘మా’ ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదని.. బాధ్యత అని.. దాన్ని సమర్ధంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నా అని చెప్పారు. ఈ ఎన్నికలు ఇలా జరిగే విషయంలో ఎవరూ సంతోషంగా లేమని.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం తన తండ్రికి ఇష్టం లేదని అన్నారు.
కానీ మార్పు తీసుకురాగలననే నమ్మకంతో వస్తున్నానని.. ‘మా’లో ఎన్నో సవాళ్లు ఉన్నాయని అన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్ కి ఉందని అన్నారు. ప్రత్యర్థి ప్యానెల్ లో మంచి నటులున్నారని.. వారిలో కొందరు తన బ్యానర్ లో పని చేసి.. డబ్బులు తీసుకున్నారని అన్నారు. ఒక నిర్మాతగా వాళ్లను తన సినిమాలోకి తీసుకుంటానని అన్నారు. ‘మా’లో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరని అన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబుతానని కాన్ఫిడెంట్ గా చెప్పారు.