సంధ్య థియేటర్ ఘటన – అల్లు అర్జున్ (Allu Arjun) ఇష్యూల తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ‘ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనున్న టాలీవుడ్’. ఇదంతా ఈజీ కాదు.. ఇప్పుడు సందర్భమూ లేదు కానీ జనాలు ఎందుకో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ట్రెండూ అవుతోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ విషయంలో నటుల నుండి ఎలాంటి స్పందనా లేదు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) అసోసియేషన్ కీలక సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Manchu Vishnu
మా సభ్యులంతా సహనంతో వ్యవహరించండి.. బహిరంగంగా కామెంట్స్ చేయవద్దు అని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సభ్యులు అందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను కూడా వెల్లడించడం సరికాదు అని చెప్పినట్లు టాక్. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది సంతృప్తికరంగా లేరని వార్తలొస్తున్నాయి. అలాగే సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపు ఇచ్చారంటున్న నేపథ్యంలో ఏ ఒక్క రాష్ట్రానికి తాము అనుకూలం కాదని, రెండు రాష్ట్రాలు తమకు ఒకటే అని విష్ణు అన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలూ వద్దని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే, అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు అతనివైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతుండటం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు అని సమాచారం. జరిగిన నష్టం గురించి, కుటుంబ కష్టం గురించి పార్టీలు పట్టించుకోవడం లేదు అని అంటున్నాయి.
దీంతో ఈ విషయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్ వ్యవహారంలో ‘మా’లోని నటులు ఎవరూ బహిరంగంగా స్పందించడం లేదు. ఇప్పుడు మంచు విష్ణు సూచనల నేపథ్యంలో ఎప్పటికీ స్పందించరు అని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంతో సున్నం పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి.