శౌబిన్ షాహిర్, బాలు వర్ఘీసీ, గణపతి తదితరులు.. (Cast)
చిదంబరం (Director)
బాబు షాహిర్ - శౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ (Producer)
సుషిన్ శ్యామ్ (Music)
షైజు ఖలీధ్ (Cinematography)
Release Date : ఏప్రిల్ 06, 2024
ఫిబ్రవరి నెలలో మలయాళ ఇండస్ట్రీ సృష్టించిన అద్భుతాల్లో “మంజుమ్మల్ బాయ్స్” (Manjummel Boys) ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి నెం.1 మలయాళ సినిమాగా నిలిచింది. నిజానికి ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ను గత నెలలోనే విడుదల చేద్దామని సన్నాహాలు చేసినప్పటికీ.. 200 కోట్ల రూపాయల మలయాళ రికార్డ్ కోసం వెయిట్ చేసి ఇవాళ (ఏప్రిల్ 6) తెలుగు ప్రేక్షకులకు అనువాదరూపాన్ని అందించారు మైత్రీ మూవీ మేకర్స్. మరి ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
కథ: ఏవో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా గడిపే కొందరు కుర్రాళ్ళు.. తమ ఆపొజీషన్ టీం ట్రిప్ కి వెళ్లారని తెలుసుకొని, తాము కూడా వెళ్లాలని డిసైడ్ అవుతారు. అలా మంజుమ్మల్ బాయ్స్ అందరూ కలిసి కొడైక్కెనాల్ వెళతారు. అక్కడి గుణ గుహల సౌందర్యాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్న తరుణంలో.. సుభాష్ (శ్రీనాథ్ బాసి) (Sreenath Bhasi) ఒక్కసారిగా పెద్ద లోయలోకి జారిపోతాడు. సుభాష్ ను మళ్ళీ పైకి తీసుకురావడానికి మంజుమ్మల్ బాయ్స్ ఎంత కష్టపడ్డారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది “మంజుమ్మల్ బాయ్స్” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో కీలకపాత్రధారి కావడమే కాక నిర్మాత కూడా అయిన శౌబిన్ షాహిర్ (Soubin Shahir) అవార్డ్ విన్నింగ్ నటనతో ఆకట్టుకున్నాడు. స్నేహితుడ్ని అనవసరంగా ప్రాణాపాయ స్థితిలో ఇరికించాననే బాధ, అతడిని ఎలాగైనా కాపాడాలనే ధృడ నిశ్చయం, కాపాడిన తర్వాత అదేదో గొప్పలా భావించకుండా.. బాధ్యత నెరవేర్చిన సంతృప్తితో మిన్నకుండిపోయే స్థితప్రజ్ఞతను చాలా అద్భుతంగా తెరపై పండించాడు. ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన శౌబిన్ ఇప్పుడు మలయాళంలో ఒన్నాఫ్ ది ప్రామిసింగ్ యాక్టర్ గా నిలవడం అనేది అతడి ప్రతిభకు తార్కాణం. అలాగే.. శ్రీనాధ్ బాసి నటన కూడా అలరిస్తుంది.
లోయలో పడి, ఓ కొండ చివరన వ్రేలడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడే వ్యక్తిగా అతడి స్క్రీన్ ప్రెజన్స్ & కళ్ళల్లో కనబడే భయం, అక్కడి నుండి బయటపడిన తర్వాత కూడా ఆ భయం తాలూకు జ్ఞాపకాలతో కలవరపడే సన్నివేశాల్లో జీవించేశాడు. మిగతా స్నేహితులందరూ కూడా పాత్రల్లో ఒదిగిపోగా.. టీ షాపు వ్యక్తిగా జార్జ్ మర్యన్ (George Maryan) మరియు టూరిస్ట్ గైడ్ గా రామచంద్రన్ దురైరాజ్ (Ramachandran Durairaj) తమ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సుశిన్ శ్యామ్ (Sushin Shyam) పాటలు & నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ విషయంలో తీసుకొన్న జాగ్రత్తలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. చెట్టు వేర్లు మొలిచే శబ్ధాలు మొదలుకొని కొండల మధ్య గాలి ప్రవహించే సౌండ్ కూడా ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడం అనేది మామూలు విషయం కాదు. సినిమా ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేసిన సౌండ్ డిజైనర్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.
అలాగే.. గుణ కేవ్స్ ను అచ్చుగుద్దినట్లుగా డిజైఙ్ చేసిన సెట్ డిపార్ట్మెంట్ ను కూడా మెచ్చుకోవాలి. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆ గుహలు సెట్ అని చిత్రబృందం చెబితే తప్ప తెలియదు. అంత చక్కగా రియలిస్టిక్ లొకేషన్ లా ఆ గుహలను చూపించాడు.
దర్శకుడు చిదంబరం (Chidambaram S. Poduval) ఒక చిన్న పాయింట్ ను కథగా అల్లుకున్న విధానం, కీలకమైన సన్నివేశాలను చిన్నప్పటి పాత్రలతో, సందర్భాలతో ముడిపెట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. సినిమా మొత్తానికి “ప్రియతమా నీవచట కుశలమా” అనే పాటను వాడుకొన్న తీరును ప్రశంసించకుండా ఉండలేమ్. అలాగే.. సినిమా మొత్తం అయిపోయింది అనుకున్న తరుణంలో తల్లి పాత్రతో పండించిన ఎమోషన్ సినిమాకి బిగ్గెస్ట్ ఎలివేషన్. సినిమాను అలా ముగించారు గనుకే యావత్ సినిమా ప్రేక్షకుల మనసుతోపాటు బాక్సాఫీసును కూడా కొల్లగొట్టింది.
విశ్లేషణ: కేవలం 135 నిమిషాల నిడివితో.. సినిమాను, సినిమాలోని ఎమోషన్స్ ను పక్కదోవ పట్టించే అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా, నిక్కచ్చిగా రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని సీటు చివర కూర్చోబెట్టి.. ఒక ఉద్వేగభరితమైన సంతృప్తితో థియేటర్ ను వీడేలా చేసే సినిమా “మంజుమ్మల్ బాయ్స్”. డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి.. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరించడం ఖాయం.
ఫోకస్ పాయింట్: అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్!
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus