ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా మలయాళంలో ‘మార్కో’ (Marco) అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. హనీఫ్ అదేని (Haneef Adeni) దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. అక్కడ సూపర్ హిట్ అయ్యింది. జనవరి 1న తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. ఈ సినిమా గురించి ఒక్కటే మాట చెప్పారు. అదే ‘అసలు ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు’ అని..!
ఎందుకంటే సినిమాలో అంత దారుణమైన వయొలెన్స్ ఉంటుంది. అయినప్పటికీ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ సినిమాని చూశారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇక్కడ మాత్రం దీనికి మరింత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో అంత దారుణమైన వయొలెన్స్ ఉంటుంది. అందుకే సి.బి.ఎఫ్.సి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) వారు ఈ సినిమాని ఓటీటీ నుండి నిషేదించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రాన్ని శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని కూడా సి.బి.ఎఫ్.సి రీజినల్ ఆఫీసర్ ఓ నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఇలాంటి సినిమా యువతని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆ నివేదికలో రాసుకొచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది.
అయితే మరోపక్క ‘మార్కో’ టీం.. ఆల్రెడీ తమ సినిమాకి సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారని.. ఆల్రెడీ సెన్సార్ అయిన సినిమాపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ డిఫెండ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఓటీటీలో ఎలా ఉన్నా.. శాటిలైట్ ఛానల్స్ కి అయితే ‘మార్కో’ కంటెంట్ ను పూర్తిగా బ్యాన్ చేసినట్టే అని చెప్పాలి.