“పొగరు” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ నటుడు ధృవ సర్జా నటించిన తాజా చిత్రం “మార్టిన్” (Martin) . కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రానికి యాక్షన్ కింగ్ అర్జున్ కథ అందించగా.. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేశారు. హే ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
Martin Review
కథ: పాకిస్థాన్ లో ఓ ఇండియన్ అరెస్ట్ అవుతాడు. అతడ్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తానీ పోలీస్ హైకమాండ్ రంగంలోకి దిగి అతడ్ని జైలుకు తీసుకొస్తుంది. జైల్ కి తీసుకొచ్చాక అతడి పేరు అర్జున్ (ధృవ్ సర్జా) అని తెలుస్తుంది. అయితే.. జైల్ నుంచి తప్పించుకు వెళ్లిన అర్జున్ కి, తాను పాకిస్థాన్ లో జైల్ కి వెళ్ళడానికి కారణం మార్టిన్ అని తెలుసుకుంటాడు. అసలు అర్జున్ పాకిస్థాన్ ఎందుకు వచ్చాడు? మార్టిన్ ఎవరు? అర్జున్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మార్టిన్” (Martin) చిత్రం.
నటీనటుల పనితీరు: ఏ సినిమాలోనైనా ఎవరో ఒక్కరు కాస్త అతిగా నటిస్తారు. కానీ మార్టిన్ లో ఏంటో.. హీరో కమ్ విలన్ ధృవ్ సర్జా మొదలుకొని హీరోయిన్ వైభవి, వ్యాంప్ రోల్ అన్వేషి జైన్, స్నేహితుల పాత్రలు పోషించిన నటీనటులు అందరూ ఓవర్ యాక్షన్ తో చిరాకు పుట్టించారు. ముఖ్యంగా ధ్రువ్ సర్జా నటన కంటే అతడి డబ్బింగ్ ఎక్కువ చిరాకుపెట్టింది.
కోపంతో పీల్చే ఎగశ్వాస థియేటర్లో ఏదో పెద్ద సైజు గురకలా వినిపిస్తుంది. సినిమా తట్టుకోవడం కంటే.. ఈ గాలి పీల్చే సౌండ్ తట్టుకోవడానికి ఎక్కువగా ఇబ్బందిపడతారు ప్రేక్షకులు. హీరోయిన్ వైభవి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉన్న కొన్ని సీన్స్ లో కూడా కనీస స్థాయి హావభావాలు పండించలేక బ్లాంక్ ఫేస్ పెట్టేసింది.
సాంకేతికవర్గం పనితీరు: కన్నడ ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చిన “కె.జి.ఎఫ్” లాంటి సినిమా తీద్దాం అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సినిమా స్థాయి అలా ఉండాలి కానీ.. సినిమానే అలా ఉండకూడదు. ఎడిటింగ్, కెమెరా వర్క్ అచ్చుగుద్దినట్లుగా కేజీఎఫ్ ను గుర్తు చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ ఎంత నాసిరకంగా ఉన్నాయంటే.. ఇన్ఫోబెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో చిన్నపిల్లల కోసం తయారు చేసే వీడియోల్లో బెటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్యాంకర్ బ్లాస్టింగ్ సీన్ ను కంపోజ్ చేసిన తీరు బాగున్నా.. గ్రాఫిక్స్ దెబ్బకి చిర్రెత్తుకొస్తుంది.
మణిశర్మ పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం మాత్రం థియేటర్లో సేదతీరుదామని వచ్చిన ప్రేక్షకుల గుండెలు అదిరేలా ఉంది. యాక్షన్ బ్లాక్స్ చూస్తుంటే.. “జెమినీ మ్యాన్, మ్యాడ్ మాక్స్” సినిమాలు కచ్చితంగా గుర్తుకొస్తాయి. ఆ స్థాయిలో లేవు.. సేమ్ అలానే వాటి చీప్ కాపీస్ లా ఉన్నాయి.
మన హీరో యాక్షన్ కింగ్ అర్జున్ రాసిన కథలోనే అసలు దమ్ము లేదు అనుకుంటే.. దర్శకుడు ఏ.పి.అర్జున్ ఆ కథను తెరకెక్కించిన విధానం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. హాలీవుడ్ స్థాయి ఫిలిం మేకింగ్ క్వాలిటీ బాగుండాలి కానీ.. ఏవో కొన్ని హాలీవుడ్ సీన్స్ కాపీ కొడితే సరిపోదు. ఈస్థాయి కాన్వాస్ ఉన్న సినిమాను తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాలి అనుకోవడమే పెద్ద సమస్య. మరి మేకర్స్ ఎలా కన్విన్స్ అయ్యారో, పాన్ ఇండియన్ రిలీజ్ కి ఏ నమ్మకంతో రంగంలోకి దిగారో వాళ్లకి తెలియాలి.
విశ్లేషణ: ఊర మాస్ సినిమాల్లో సెన్స్ & లాజిక్స్ వెతకడం అనేది కచ్చితంగా తప్పే. అలాగని కథ-కథనాలను గాలికి వదిలేసి, ఇష్టమొచ్చినట్లు లో క్వాలిటీ గ్రాఫిక్స్ లో ఫైట్స్ & ఎబ్బెట్టైన వ్యాంప్ క్యారెక్టర్ ఎక్స్ పోజింగ్ తో సినిమాను తెరకెక్కిస్తే.. బి,సి సెంటర్ మాస్ ఆడియన్స్ చూసేస్తారు అనే భ్రమ నుండి ఫిలిం మేకర్స్ బయటికి రావాలి. అలా రాకపోతే ఏమవుతుంది అనేందుకు “మార్టిన్” (Martin) ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇంత చదివాక కూడా సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఓ ప్యాకెట్ కాటన్ తీసుకెళ్లడం మర్చిపోకండి.
ఫోకస్ పాయింట్: ఆడియన్స్ మీద రివెంజ్ ఎందుకయ్యా “మార్టిన్” ?!