లాక్ డౌన్ దేశంలో ఎంతటి క్లిష్టపరిస్థితులకు కారణం అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా రోజువారి కూలీలు, వలస కార్మికులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. భవిష్యత్ ఏమిటో తెలియక వారు నిరాశ, నిస్పృహలలో కూరుకుపోతున్నారు. కాగా వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనడానికి తాజా ఉదంతం మరొక ఉదాహరణ. గత రాత్రి నుండి సోషల్ మీడియాలో హీరో సల్మాన్ ఖాన్ పేదవారికి డబ్బులు పంచనున్నారు అనే వార్త ప్రచారం జరిగింది. ఇది నిజం అని భావించిన చాలా మంది ఉదయాన్నే సల్మాన్ నివాస ప్రాంతమైన ఖాండు పడ ప్రాంతానికి చేరుకున్నారు.
వందల సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దానితో పోలీసులను అక్కడ చేరిన వారిని చెదరగొట్టారట. అలాగే ఈ వదంతులు ఎవరు పుట్టించారో వెతికే పనిలో పోలీసులు ఉన్నారట. లాక్ డౌన్ వేళ హీరో సల్మాన్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు, సినీ కార్మికులకు ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో అత్యంత ధనవంతుడైన హీరోగా ఉన్న సల్మాన్ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుటారు.
ఇక ప్రతి ఏడాది రంజాన్ కానుకగా ఓ మూవీ విడుదల చేయడం సల్మాన్ కి అలవాటు. గత ఏడాది సల్మాన్ భారత్ అనే మూవీని రంజాన్ కానుకగా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఏడాది ప్రభుదేవ దర్శకత్వంలో రాధే అనే మూవీ విడుదల చేయాలని చూసినా లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. అలాగే సల్మాన్ కభీ ఈద్ కభీ దివాలి అనే మూవీలో నటించాల్సివుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించడం విశేషం.