సినిమాల్లో రారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడి 18 స్థానాలను గెలుచుకున్నారు చిరంజీవి (Chiranjeevi) . అయితే అనూహ్యంగా పార్టీకి కాంగ్రెస్‌లో కలిపేసి రాజ్యసభకు వెళ్లిపోయారు. టర్మ్ అయ్యాక తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. అయితే అప్పటి నుండి ఎన్నోసార్లు ఆయన రాజకీయ జీవితం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి నిజం కాకుండా ఆగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అదే పుకారు వచ్చింది. అవును, చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.
అయితే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాకుండా రాజ్యసభకే వెళ్లాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆయన భారతీయ జనతా పార్టీ చర్చలు జరుపుతోంది అని అంటున్నారు. నిజానికి పెద్దల సభకు నాగబాబు (Naga Babu) వెళ్లాలని అనుకున్నారని.. కానీ చిరంజీవి కోసం బీజేపీ రాజ్యసభ ఆలోచన చేస్తోంది అని చెబుతున్నారు. ఈ కారణంగానే నాగబాబుకు ఏపీ కేబినెట్‌లోకి తీసుకున్నారని అంటున్నారు. ఇక చిరంజీవి సంగతి చూస్తే.. సినిమా లేదా సోషల్ సర్వీస్ కేటగిరీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరును నామినేట్ చేసే అవకాశముంది అని చెబుతున్నారు.
రాష్ట్రపతికి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది. ఆర్ట్స్, లిటరేచర్‌తో పాటు సోషల్ సర్వీస్ రంగాల్లోని ప్రముఖులను ఆ కోటా కింద నామినేట్ చేస్తుంటారు. ఇప్పుడూ అదే చేస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌డీఏ కూటమిలో జనసేన ప్రస్తుతం కీలకంగా ఉంది. భవిష్యత్తు పవన్ సౌత్ రాజకీయాల్లో కీలకంగా మారుతారు అనే మాట కూడా వినిపిస్తోంది.
ఈ కారణంతోనే ఆయన కుటుంబానికి పదవులు దక్కుతున్నాయి అని చెబుతున్నారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న చిరంజీవి.. రాజ్యసభకు వెళ్తారా? లేక ఎలాంటి రాజకీయాలకైనా దూరం అని పట్టుపట్టి కామ్‌గా ఉంటారా అనేది చూడాలి. ఒకవేళ వెళ్తే ఒకే కుటుంబం నుండి ముగ్గురు అన్నదమ్ములు ఒకే సమయంలో వివిధ పాలక పదవుల్లో ఉండటం గొప్ప విషయమే.