సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు… ఎంత ప్లానింగ్ ప్రకారం చేశామన్నది ముఖ్యం అంటుంటారు మన సినిమా పెద్దలు. అందుకే స్టార్ హీరోలు వరుస సినిమాలు చేసేయకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్తుంటారు. అయితే అన్నిసార్లు విజయం దక్కకపోయినా, పెద్ద పెద్ద దెబ్బలు అయితే తగలవు. కానీ మెగాస్టార్ ప్రస్తుత జోరు చూస్తే అభిమానుల్లో చిన్న గుబులు కనిపిస్తోందట. కారణం సినిమాల ఎంపిక, ప్రకటనల విషయమే. ‘ఆచార్య’ చేస్తున్న చిరంజీవి తన తర్వాత సినిమాల్ని ఎప్పుడో ప్రకటించేశాడు. ఇప్పుడు విషయం ఆ సినిమాల షూటింగ్ ప్లాన్స్.
కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రీకరణ చివరికొచ్చింది. దీంతో చిరు చూపు తర్వాతి సినిమాల మీద పడింది. మొన్నీ మధ్య మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు మెహర్ రమేశ్ డైరక్షన్‌లో ‘వేదాళం’ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఆ తర్వాత లైన్లో బాబీ సినిమా కూడా ఉందనే విషయం తెలిసిందే. ‘వేదాళం’ లుక్ టెస్ట్ అంటూ గుండు ఫొటోను ఇటీవల ట్వీట్ చేసి ఆ సినిమా తొలుత మొదలవుతుందని చెప్పకనే చెప్పాడు చిరు. ఈలోగా ‘లూసిఫర్’ డైరక్టర్‌ను ప్రకటించేసి ట్విస్ట్ ఇచ్చాడు. ఆ లెక్కన ఇదే ఫస్ట్.
త్వరలోనే ‘ఆచార్య’ చిత్రీకరణ ముగించుకొని ఫిబ్రవరిలో ‘లూసిఫర్’ వర్క్ స్టార్ట్ చేస్తాడట. రెండు నెలల్లో ఆ సినిమా పూర్తి చేసి ఆ వెంటనే ‘వేదాళం’ మొదలుపెడతాడట. అదయ్యాక బాబీ సినిమా అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలే బయట పరిస్థితులు బాగోలేదు. సినిమా టీమ్‌లో ఎవరికైనా కరోనా వస్తే చిత్రీకరణ ఆపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు మొదలుపెట్టి చేతులకానీ కాల్చుకోడు కదా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతాబాగుంది కానీ చిరు అసలు ఎందుకు వరుస సినిమాలు చేసేస్తున్నాడు. కెరీర్‌లో మంచి జోరులో ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదే. ఏమో ఏదైనా ఆడియో ఫంక్షనో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ఈ విషయం చెబుతాడేమో చూడాలి.