మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా ఏంటి? గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఎందుంకటే ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అవసరం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ కోసం చాలామంది యువ దర్శకుల పేర్లు వినిపించాయి. మోహన్‌రాజా (Mohan Raja) , వినాయక్ (V. V. Vinayak) , హరీశ్ శంకర్ (Harish Shankar).. ఇలా చాలా పేర్లు వచ్చాయి. చాలా ప్రొడక్షన్ హౌస్‌ల పేర్లూ వినిపించాయి. అయితే వాళ్లెవరూ కాకుండా, అవేవీ కాకుండా చిరంజీవి కొత్త దర్శకుడిని, వేరే నిర్మాణ సంస్థను ఓకే చేశారు అని తెలుస్తోంది.
నానికి (Nani) ‘దసరా’ (Dasara) లాంటి కెరీర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నాడు అని టాక్. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది. సీనియర్ కథానాయకులు, యువ దర్శకులు.. ఈ కాంబినేషన్ గత కొద్ది రోజులుగా హిట్ కాంబినేషన్‌గా మారింది. అన్ని భాషల్లోనూ ఇలాంటి కాంబోలు కనిపిస్తున్నాయి. చిరంజీవి కూడా ఇదే కాంబోను వాడి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లాంటి భారీ విజయం అందుకున్నారు.
ఈ నేపథ్యంలో చిరు – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఉంటాయి. ‘దసరా’ సినిమా విడుదల తర్వాత శ్రీకాంత్ తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు. రెండో సినిమాగా అదే ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి సినిమా పక్కా అని అంటున్నారు.
అయితే చిరంజీవి ‘విశ్వంభర’ తర్వాత ఇమ్మీడియెట్ సినిమా ఇదేనా? అనేది డౌట్. ఎందుకంటే పీపుల్ మీడియా, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. బీవీఎస్ రవి ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధం చేశారు. దానికి దర్శకుడు ఎవరు అనే ప్రశ్న దగ్గర ప్రాజెక్ట్ ఆగింది. మోహన్ రాజా, వీవీ వినాయక్, హరీశ్ శంకర్ పేర్లు ఆ సినిమా కథకే వినిపిస్తున్నాయి.