తెలుగు చిత్ర పరిశ్రమలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ లలో మెహ్రీన్ ఒకరు. ఆమె గోపిచంద్ తో కలిసి చేసిన “పంతం” ఈ గురువారం రిలీజ్ కానుంది. అందుకే చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఫీవర్ కారణంగా “పంతం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెహ్రీన్ హాజరుకాలేకపోయింది. దీంతో మీడియా ఆమెపై రకరకాల వార్తలు ప్రచురించాయి. మెహరీన్ ఇంటర్వ్యూలో మీడియాపై మండిపడ్డారని, మీడియా తనను చికాగో వివాదంలోకి లాగాలని చూస్తోందని అన్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై మెహ్రీన్ ట్విట్టర్ వేదిక ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో ఏవేవో వార్తలు రాస్తున్నాయి. కానీ నేనెవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వైరల్ ఫీవర్ కారణంగా పంతం లాస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ కు నేను హాజరు కాలేకపోయాను.” అని ఆ వార్తలను ఖండించారు. ఇక చికాగో వివాదం గురించి మాట్లాడుతూ..
“మా ఫ్యామిలీతో నేను వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ కు వీకెండ్ హాలిడే ట్రిప్ కు వెళ్లాను. ఆ సమయంలో నేను ఇమిగ్రేషన్ కోసం వెళ్లినప్పుడు అక్కడి ఆఫీసర్స్ నన్ను తెలుగు హీరోయిన్ గా గుర్తించారు. యూనైటెడ్ స్టేట్స్ కు నేను రావడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అప్పుడే నేను చికాగో రాకెట్ గురించి ఆ ఆఫీసర్స్ ద్వారానే విన్నాను. నాకు ఆ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని తెలిశాక, వారు నాకు సారీ చెప్పి నా ప్రయాణానికి ఆటంకం లేకుండా చూశారు. ఆ విషయం గురించి వాస్తవం నేను చెప్తేనే మంచిదని చెప్తున్నా.” అని జరిగిన విషయాన్నీ వివరించింది. చివరగా .. “తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిది. నావల్ల దాని ఇమేజ్ చెడిపోయేలా నేనెప్పటికీ ప్రవర్తించను. ఇక కొందరు చేసిన కొన్ని పనుల వల్ల మొత్తం పరిశ్రమకే బ్యాడ్ నేమ్ వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అలాంటి వారికి సరైన శిక్ష పడాలని కోరుకుంటున్నా. దయచేసి నా గురించి వార్తల్ని నన్ను సంప్రదించకుండా రాయొద్దు” అని మీడియా వారిని మెహ్రీన్ వేడుకుంది.