గతేడాది థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం “అంజమ్ పాతిర”. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 60 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించింది “ఆహా” యాప్. ఫిబ్రవరి 19 నుంచి ఆహా యాప్ లో “మిడ్ నైట్ మర్దర్స్” పేరుతో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
కథ: అన్వర్ హుస్సేన్ (కుంచకో బొబన్) ఓ సైకాలజిస్ట్. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైధీలను కలిసి వారితో మాట్లాడి, వాళ్ళు ఎందుకు హత్య చేశారు? అందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అని రీసెర్చ్ చేస్తూ.. పోలీసులకు కూడా కొన్ని కేసుల్లో సహాయపడుతుంటాడు. పోలీస్ డిపార్ట్ మెంట్లో కన్సల్ టెంట్ క్రిమినాలజిస్ట్ గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. వరుసబెట్టి పోలీస్ ఆఫీసర్స్ హత్యకు గురవ్వడం మొదలవుతుంది. అన్నీ అర్ధరాత్రి హత్యలే. ఎవరు చేస్తున్నారు? ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు? అనేది ఎవరికీ అర్ధం కాదు. అదే సమయంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్ తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అనేది మీకు తెలియాలంటే ఆహా యాప్ లో సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అన్నట్లు లేకుండా.. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముఖ్యంగా ఎంత అవసరమో అంతే ఎమోషన్ ను పండించారు. కుంచకో బొబన్ ఒక టిపికల్ క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో ప్లే చేశాడు. కథ మొత్తం అతడి పాత్ర చుట్టూ, అతడి క్యారెక్టర్ వల్లే నడుస్తుంది. సినిమా మొత్తం అతనే కనిపించినా ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ బోర్ కొట్టించడు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మిధున్ మాన్యుల్ ను మెచ్చుకోవాలి. ఒక సింపుల్ స్టోరీ లైన్ తో ఇంత అద్భుతమైన థ్రిల్లర్ ను రెండున్నర గంటలపాటు నడపడం అంటే మామూలు విషయం కాదు. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ చేయకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన విధానం బాగుంది. అయితే.. మోటివ్ పాయింట్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. మర్దర్స్ లో ఉన్న ఇంటెన్సిటీ మోటివ్ లో కనిపించలేదు. అందువల్ల వార్నీ ఈమాత్రం దానికే హత్యలు చేసేయాలా అనుకొంటారు ప్రేక్షకులు. నిజానికి కన్నడ సినిమా “యు టర్న్” కూడా ఇలాగే ఉంటుంది. చివర్లో ఇచ్చే జస్టిఫికేషన్ కి అంతగా కనెక్ట్ అవ్వలేమ్. అయితే.. థ్రిల్లర్ సినిమాలకు జస్టిఫికేషన్ కంటే ఎమోషనల్ కనెక్టివిటీ & ప్రొసీడింగ్స్ ముఖ్యం అని మరోసారి స్పష్టమవుతుంది ఈ సినిమా ద్వారా. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. అన్నిటికీ మించి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది.
విశ్లేషణ: రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిన సగటు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ “మిడ్ నైట్ మర్దర్స్”. పోలీస్ ఇన్వెస్టిగేషన్ & క్రిమినల్ సైకలాజికల్ బిహేవియర్ గురించి ఇంత డీటెయిల్డ్ గా సౌత్ సినిమాల్లో ఎప్పుడూ చూపించలేదు. అన్నిటికీ మించి స్క్రీన్ ప్లే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. “రాక్షసుడు” అనంతరం ఆస్థాయిలో ఆకట్టుకునే సినిమా “మిడ్ నైట్ మర్దర్స్”.