సినిమా పరిశ్రమలో స్నేహాలు ఉంటాయా? స్నేహితులు ఉంటారా? ఇవేం ప్రశ్నలు.. మనం చాలా మంది స్నేహితుల్ని చూశాం కదా. వారి మాటలు విన్నాం కదా అని అంటారా? అయితే ఆ స్నేహాల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది వారికి మాత్రమే తెలుసు. ఇంతటి డౌట్ ఉన్న సినిమా పరిశ్రమ స్నేహాల మధ్యలో ఓ గొప్ప స్నేహం ఉంది. తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోలేదని.. దేవాలయానికి వెళ్లి గుట్టుగా (బయటకు వచ్చేసింది అనుకోండి) పూజలు చేయించి స్నేహితుడు అతను. ఇప్పుడు అతనే మరోసారి తన స్నేహం పవర్ చూపించారు.
Mohan lal – Mammootty
ఇక్కడ స్నేహం చూపించిన ఆ హీరో మోహన్‌లాల్ అయితే.. అలాంటి స్నేహం పొందిన హీరో మమ్ముట్టి. మలయాళ సినిమా పరిశ్రమలో ఈ ఇద్దరూ గత కొన్ని దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వారి మధ్య స్నేహం గురించి గత కొన్నేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నాం. ఈ నెల 7న మలయాళ బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయడానికి వచ్చిన మోహన్ లాల్ ఓ స్పెషల్ చొక్కా వేసుకున్నారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్. ఎందుకంటే ఆ చొక్కా మీద మమ్ముట్టి ఫొటోలు ఉన్నాయి.
మమ్ముట్టి తన 74వ పుట్టిన రోజును ఈ నెల 7న నిరాడంబరంగా జరుపుకున్నారు. వివిధ కారణాల వల్ల హడావుడి లేకుండా బర్త్ డే జరిగిపోయింది. ఆయన బయటికి కూడా రాలేదు. ఈ క్రమంలో అతని ఆప్తమిత్రుడు మోహన్‌లాల్ ఎలా విషెస్ చెబుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయనేమో మమ్ముట్టి బొమ్మలతో నిండిపోయిన చొక్కా వేసుకొని ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. మమ్ముట్టి ఐకానిక్ సినిమాలు, క్యారెక్టర్లతో ఆ చొక్కాను డిజైన్ చేశారు.
ఒక టాప్ స్టార్ అయి ఉండి ఇంకో టాప్ స్టార్ బొమ్మలతో ఉన్న చొక్కా వేసుకొని బయటకు రావడం, ఓ టీవీ షో హోస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అందుకే ఆ ఇద్దరినీ, వారి స్నేహాన్ని సినిమా అభిమానులు సంబరంలా జరుపుకున్నారు.