ఈవారం సడన్ రిలీజుల్లో ఒకటి “మంత్ ఆఫ్ మధు” చిత్రం. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతిగా అందరికీ సుపరిచితురాలైన స్వాతిరెడ్డి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకుల్ని బాగా మెస్మరైజ్ చేసింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: అమెరికాలో పుట్టి పెరిగి.. బంధువుల పెళ్లి కోసం వైజాగ్ వచ్చిన మధు (శ్రేయ నవేలి), వైజాగ్ లో పుట్టి, వ్యక్తిగా ఎదగలేకపోయిన మధుసూదనరావు (నవీన్ చంద్ర) ఒకానొక సందర్భంలో కలుసుకుంటారు. ఇద్దరివి భిన్న మనస్తత్వాలు, పరిస్థితులు, జీవితాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎందుకు తన నుంచి విడిపోయి విడాకులు కావాలని కోర్టులు చుట్టూ తిరుగుతుందో అర్ధం కాక, సరైన ఉద్యోగం లేక స్నేహితుడితో కలిసి బీచ్ లో కూర్చొని మందు తాగుతూ తిరిగే మధుసూదనరావు బాధలు, కష్టాలు ఒకటైతే.
తనను తనలా ఉండనివ్వడం లేదనే వైరాగ్యంతో తల్లిదండ్రులకు దూరంగా, రియాలిటీని వెతుక్కుంటూ ప్రయాణిస్తుంటుంది. ఈ రెండు భిన్న ధృవాల కథలు.. ఒకటిగా ఎలా కలిశాయి? ఎవరి నుంచి ఎవరు ఏం నేర్చుకున్నారు? అనేది “మంత్ ఆఫ్ మధు” కథాంశం.
నటీనటుల పనితీరు: నవీన్ చంద్రలో భగ్న ప్రేమికుడ్ని చూడడం ఇదేం మొదటిసారి కాదు.. ఇదివరకు పలు సినిమాల్లో ఇదే తరహా పాత్రలో చూశాం. కానీ.. ఈసారి తన తప్పు తాను ఒప్పుకోలేని ఈగోయిస్టిక్ & ఫెయిల్డ్ పర్సన్ గా నవీన్ చంద్ర నటన విశేషంగా అలరించింది. మంచి పాత్ర రాయాలే కానీ.. అందులో పరకాయ ప్రవేశం చేస్తానని చెప్పకనే చెబుతున్నాడు నవీన్ చంద్ర.
శ్రేయ నవేలికి ఇది మొదటి సినిమా అని ఎక్కడా అనిపించలేదు. ఆమె క్యారెక్టరైజేషన్ ప్రెజంట్ జనరేషన్ అమ్మాయికలు కొంత మేరకు కనెక్ట్ అవుతుంది. చాన్నాళ్ల తర్వాత స్వాతి మంచి పాత్రలో కనిపించింది. రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయిందామె. రాజా చేబోలుకు ఒక మంచి పాత్ర లభించింది. హర్ష చేముడు, రుచిత, జ్నానేశ్వరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సాంకేతిక వర్గం మొత్తంలో సినిమాకి న్యాయం చేసినవారు కెమెరామెన్ రాజీవ్. పాత్రలు, పరిస్థితులు, సందర్భాలలోని ఎమోషన్స్ ను తన కెమెరా ఫ్రేమ్స్ లో చూపించి తెరపై పండించిన విధానం బాగుంది. ముఖ్యంగా సముద్రంలోని అగాధాన్ని జీవితాలతో ఇంటర్ లింక్ చేస్తూ చూపించే ఫ్రేమ్స్ మనసుకి హత్తుకుంటాయి.
అచ్చు రాజామణి పేరు తెలుగు సినిమా టైటిల్ కార్డ్స్ లో చూసి చాలా రోజులైంది. మామూలుగా అయితే మంచి పాటలతో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచే అచ్చు.. ఈ సినిమాకి ఎందుకో న్యాయం చేయలేకపోయాడు. సినిమాను, పాత్రలను అతడు సరిగా అర్ధం చేసుకోలేకపోయాడో లేక, దర్శకుడు సరైన ట్యూన్స్ సెలక్ట్ చేసుకోలేకపోయాడో తెలియదు కానీ.. పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ సినిమా మూడ్ & ఎమోషన్స్ తో సింక్ అవ్వలేదు.
ఇక దర్శకుడు శ్రీకాంత్ నాగోతు గురించి మాట్లాడుకుందాం. శ్రీకాంత్ కి తన సినిమాను ఎలాంటి ఆడియన్స్ చూస్తారు అనే విషయంలో క్లారిటీ ఉంది. అందుకే.. సినిమా ప్రమోషన్స్ మొదలుకొని రిలీజ్ వరకూ తన టార్గెట్ ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్లే కంటెంట్ ను వదిలాడు. అయితే.. రచయితగా మంచి ఆలోచనా శక్తి ఉన్న శ్రీకాంత్ కు, దర్శకుడిగా పట్టు లేదు అనిపిస్తుంది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని ఒక డ్రామాలో ఇన్వాల్వ్ చేయాలంటే కేవలం క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్ & ఎమోషన్స్ సరిపోతాయా? కథనం అవసరం లేదా? అనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం చెప్పాల్సి ఉంది.
ముఖ్యంగా రెండు తరాల అంతరంగాన్ని, పరిస్థితులను తెరపై చూపుతున్నప్పుడు వాటి మధ్య సరైన లింక్ ఉండాలి కదా?, మనసుకి హత్తుకొని, ఆలోచింపజేసే సంభాషణలు సినిమాలో ఉప్పుడు, అదే స్థాయిలో అలరించే సందర్భాలు కూడా ఉండాలి కదా? దర్శకుడు వాటిని ఎందుకు పట్టించుకోనట్లు. ఒక రచయిత తాను రాసుకున్న పాత్రలు ప్రేమించడంలో తప్పు లేదు. కానీ.. ఆ పాత్రలకు ప్రేక్షకులు ఎంతవరకూ కనెక్ట్ అవుతారు? వాళ్ళు ఎంతవరకూ భరించగలరు? అనేది అర్ధం చేసుకోవాలి.
పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులపై రుద్ధాలని చేసిన విశ్వప్రయత్నంలో సినిమా పెడదోవ పట్టింది. కాకపోతే.. ప్రస్తుత తరమైనా, గతించిన తరమైనా.. బంధాల్లో భావజాలం ఒకేలా ఉంది. అప్పుడు కొన్ని చెప్పుకోలేక బాధపడిన జంటలు, ఇప్పుడు అన్నీ పంచుకున్నా.. అందులో క్లారిటీ లేక ఎలా కష్టపడుతున్నారు? అనేది చాలా సహజంగా చూపించాడు శ్రీకాంత్.
విశ్లేషణ: ఈ సినిమా పదిలో ఒక ముగ్గురుకి మాత్రమే నచ్చుతుంది. మిగతా ఏడుగురికి సినిమా అర్ధం కాలేదని కాదు.. వాళ్ళు ఎంగేజ్ చేయగలిగే స్థాయిలో శ్రీకాంత్ కథనాన్ని రాసుకోలేదు. కథనం విషయంలో శ్రీకాంత్ జాగ్రత్తపడి ఉంటే “మంత్ ఆఫ్ మధు” తెలుగులో ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయేది. అయితే.. టార్గెట్ ఆడియన్స్ ను మాత్రం కచ్చితంగా ఆకట్టుకొనే సినిమా ఇది.