కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్ పునః ప్రారంభించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంతమంది షూటింగ్ మొదలుపెట్టడానికి ముందుకు రాలేదు. కొందరు ధైర్యం చేసి షూటింగ్ మొదలుపెట్టినా.. కరోనా కేసులు వెలుగు చూడడంతో వెనక్కి తగ్గారు. అయితే కొన్ని రోజులుగా మేకర్లు, హీరోలు సినిమాలను మొదలుపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అయితే కరోనా రాకముందు షూటింగ్ జరుపుకున్న విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా మాత్రం ఇప్పటివరకు పునః ప్రారంభం కాలేదు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరిపించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టాలనే విషయంలో ఇంటరెస్ట్ చూపించడం లేదనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కరోనాకి భయపడి షూటింగ్ వద్దన్నాడా..? అంటే అలాంటిదేమీ లేదు. లాక్ డౌన్ లో కూడా విజయ్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కాబట్టి షూటింగ్ మొదలుపెట్టడానికి విజయ్ కి ఎలాంటి సమస్య లేదు. పూరి కూడా తన సినిమాల విషయంలో వెనక్కి తగ్గే రకం కాదు.
మరి ఈ సినిమాను పునః ప్రారంభించడానికి అడ్డు వస్తున్న కారణం ఏంటో తెలియడం లేదు. ముంబైలో తీయాల్సిన సన్నివేశాలకు అనుమతులు రాలేదని అన్నారు. దీంతో మరో చోట సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకు షూటింగ్ కి వెళ్లలేదు. ఓ పక్కన దర్శకుడు శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేసి విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. మరి ‘ఫైటర్’ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాలి!