2021లో ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేసిన సినిమాలు!

సినిమా అన్నాక హిట్-ఫ్లాప్ అనేది సర్వసాధారణం. దర్శకనిర్మాతలు, హీరోహీరోయిన్లే ఈ హిట్-ఫ్లాప్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ.. ప్రేక్షకుల్ని తీవ్రంగా డిజప్పాయింట్ చేసిన సినిమాల లిస్ట్ ఈ ఏడాది కాస్త పెద్దదే. మరి అవేంటో చూద్దాం..!!

రెడ్

Hero Ram's RED Movie pre-release business1

“ఇస్మార్ట్ శంకర్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ నటించిన సినిమా కావడం, తమిళంలో మంచి హిట్ అయిన “తడం” రీమేక్ అవ్వడంతో “రెడ్” మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మణిశర్మ పాటలు, హెబ్బా పటేల్ ఐటెమ్ సాంగ్, రామ్ మాస్ అవతార్ ఇలా ఏవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బోల్తా కొట్టింది.

అల్లుడు అదుర్స్

ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి ట్రోలింగ్ కి గురైన సినిమా “అల్లుడు అదుర్స్”. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సోనూ సూద్ కీలకపాత్ర పోషించాడు. ఎలాంటి అంచనాలు లేకపోయినా కనీసం కామెడీ ఎంజాయ్ చేద్దామని థియేటర్లకు వెళ్ళిన జనాలను బోర్ కొట్టించిన రొటీన్ రొడ్డకొట్టుడు సినిమా ఇది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా

బుల్లితెర సూపర్ స్టార్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో రూపొందిన “నీలీ నీలి ఆకాశం” ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ ఆ సాంగ్. అయితే.. కథ-కథనం మాత్రం ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా సరితాం ఆకట్టుకోలేకపోయాయి.

FCUK

థియేటర్లో విడుదలైన రెండో రోజే యూట్యూబ్ లో దర్శనమిచ్చిన సినిమా ఇది. జగపతిబాబును మోడ్రన్ ప్లేబోయ్ గా చూపించి, నటుడిగా ఆయన ఇమేజ్ ను ఓ రకంగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రేక్షకులు పడిన బాధ ముందు నిర్మాతకు వచ్చిన నష్టం చాలా తక్కువ అనే చెప్పాలి. గత ఏడాది విడుదలైన మోస్ట్ ఇరిటేటింగ్ ఫిలిమ్స్ లో ఈ చిత్రానిది ప్రధమ స్థానం.

చెక్

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం అంటేనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ గా నిలిచిన సినిమా “చెక్”. నితిన్, రకుల్ ప్రధానపాత్రల్లో రూపొందిన ఈ చిత్రంలో బోలెడన్ని హాలీవుడ్ సినిమాల రిఫరెన్సులు కనిపించడం భారీ డిజప్పాయింట్మెంట్ కు గురి చేసిన అంశం.

శ్రీకారం

మంచి ఫార్మ్ లో ఉన్న శర్వా, ఆల్రెడీ యూట్యూబ్ లో మంచి రిసెప్షన్ అందుకున్న కాన్సెప్ట్, కొత్త దర్శకుడు, ఆకట్టుకున్న ట్రైలర్.. ఇలా మంచి అంచనాల నడుమ విడుదలై ఆల్రెడీ ఆ తరహా సినిమాలు “మహర్షి, భూమి” విడుదలైపోవడంతో ప్రేక్షకులకు కొత్తదనం పంచలేక ఫ్లాపైన సినిమాల్లో “శ్రీకారం” ఒకటి.

చావు కబురు చల్లగా

మార్చురీ బండిలో శవాలను మోసే ఓ కుర్రాడు, భర్తను పోగొట్టుకుని ఆసుపత్రిలో నర్స్ గా పనిచేసే ఓ యంగ్ విడో మధ్య ప్రేమకథ. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ కాన్సెప్ట్ సినిమాగా చూడడానికి మాత్రం బాగుండలేకుండాపోయింది. చాలా ఎమోషన్స్ & లాజిక్స్ మిస్ అవ్వడంతో.. బాగా డిజప్పాయింట్ చేసింది. అయితే.. నటీనటులుగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్ అయ్యంగార్ లు ఆకట్టుకున్నారు.

మోసగాళ్ళు

మంచు విష్ణు హీరోగా నటించడమే కాక కథ అందించిన సినిమా “మోసగాళ్ళు”. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ కీలకపాత్ర పోషించింది. ప్రొడక్షన్ డిజైన్ నుంచి, స్టోరీ-స్క్రీన్ ప్లే వరకూ అన్నీ అంశాల్లో ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసిన సినిమా ఇది.

శశి

“ఒకే ఒక లోకం” అనే పాట వల్లే ఈ సినిమా ఒకటుందని చాలామందికి తెలిసింది. ఊహించినట్లుగానే సినిమా డిజాస్టర్ గా నిలిచింది అది వేరే విషయం అనుకోండి.

అరణ్య

“బాహుబలి” తర్వాత రాణా ఒప్పుకుని, షూటింగ్ మొదలెట్టిన సినిమా. పాపం చాలా కష్టపడ్డాడు కూడా. దాదాపు రెండేళ్లపాటు ప్రపంచంలోని పలు అడవుల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు 2021లో విడుదలైంది. చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. కథనంలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.

పాగల్

విశ్వక్ సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమా మాత్రం అలరించలేకపోయింది.

ఇచ్చట వాహనములు నిలుపరాదు

“అల వైకుంఠపురములో” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో ముఖ్యపాత్ర పోషించిన తర్వాత సుశాంత్ తన అదృష్టాన్ని హీరోగా మళ్ళీ పరీక్షించుకున్న సినిమా “ఇచ్చట వాహననములు నిలుపరాదు”. రియల్ ఇన్సిడెంట్స్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ ను అలరించడంలో విఫలమైంది.

డియర్ మేఘ

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న “దియా”కు తెలుగు రీమేక్ ఈ చిత్రం. మూల కథ “అందాల రాక్షసి”ని పోలి ఉండడం, కన్నడ వెర్షన్ తెలుగు అనువాదరూపం కూడా అదే సమయానికి విడుయాలవ్వడంతో ఈ సినిమా హిట్ అవ్వలేకపోయింది.

టక్ జగదీష్

ఒటీటీలోనే విడుదలైనప్పటికీ.. సినిమా మీద మంచి అంచనాలు ఉండడంతో, ఆల్మోస్ట్ అమెజాన్ ప్రైమ్ ఎకౌంట్ ఉన్న ప్రతి ఒక్కర్ని టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయేలా చేసిన సినిమా ఇది. అయితే.. రొటీన్ కథ, అంతకంటే రొటీన్ కథనం, వీక్ డైరెక్షన్ వల్ల ఈ చిత్రం కనీస స్థాయి ఆదరణ చూరగొనలేకపోయింది.

ఆరడుగుల బుల్లెట్

Aaradugula Bullet Movie Poster

ఎప్పుడో 2016లో షూటింగ్ మొదలై.. సడన్ గా 2021లో విడుదలైన చిత్రం “ఆరడుగుల బుల్లెట్”. గోపీచంద్-నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించినట్లుగా డిజాస్టర్ గా నిలిచింది.

పెళ్లి సందD

ఆడియో సాంగ్స్ & వీడియో సాంగ్స్ వరకూ పర్లేదు కానీ.. సినిమాగా ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లలో చాలా ఇబ్బందిపడ్డారు. అయితే.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం డిజప్పాయింట్ మాత్రం చేయలేదు. అలాగే.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా.

గాలి సంపత్

“సరిలేరు నీకెవ్వరు” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా “గాలి సంపత్”. రాజేంద్రప్రసాద్ ను నటుడిగా సరికొత్తగా పరిచయం చేసినప్పటికీ.. కథ-కథనం మాత్రం సగటు ప్రేక్షకుడికి భీభత్సంగా బోర్ కొట్టించాయి.

Share.