Game Changer: మాటల రచయిత సాయి మాధవ్ గేమ్ ఛేంజర్ గురించి ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో భారీ స్థాయిలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. వాటిని మించేలా సినిమా ఉంటుందని అంటున్నారు.. ఈ చిత్ర మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాపై మాట్లాడారు.

గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ ఇమేజ్‌ను పెంచేలానే ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘గేమ్ ఛేంజర్ నెక్ట్స్ లెవల్ మూవీ. ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటున్నారో.. అంతకంటే బాగుంటుంది. శంకర్‌గారు కూడా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. డౌన్ టు ఎర్త్ పర్సన్. శంకర్‌గారి ‘జెంటిల్‌మ్యాన్’ సినిమా చూసి..

ఈ దర్శకుడితో లైఫ్‌లో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్నాను. అలాంటి నాకు ఇప్పుడాయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ప్రతి షాట్ అద్భుతం అనేలా చిత్రీకరిస్తున్నారు. అది అనవసరమైన గ్రాండియర్ కాదు. అవసరమైన గ్రాండియర్.. కావాలని ఏదో ఖర్చు పెడుతున్నట్లుగా ఉండదు. ఆ షాట్‌కి అంత ఖర్చు అవసరం.. అంత మంది అవసరం.

చాలా పెద్ద కథ.. స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు..’’ అని చెబుతూ.. సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేశారు. అయితే ఈ మధ్య వచ్చిన ‘శాకుంతలం’ విషయంలో కూడా సాయిమాధవ్ బుర్రా ఇలానే చెప్పుకొచ్చారు. గుణశేఖర్ ఆలోచన, సమంత నటన అద్భుతం అనేలా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆ సినిమా ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. అందుకే సినిమాకు ముందు ఏ రచయిత అయినా.. ఇలానే చెబుతారు.

కానీ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పే ఫైనల్. చూద్దాం.. శంకర్, చరణ్‌ల (Game Changer) ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో..? సాయిమాధవ్ బుర్రా మాటలు ఎంత వరకు నిజమవుతాయో?. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus