మృణాల్ ఠాకూర్ అనే పేరు వినగానే… కళ్ల ముందు కదలాడే రూపం సీత. దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాలో ఆమె పోషించిన పాత్ర అది. ఆ ఇమేజ్‌కు ఆమెకు ఎంతగా అద్దిపోయింది అంటే… మృణాల్ అనగానే ‘సీత కదా!’ అనేంత. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మృణాల్ ఆ ఇమేజ్ అంటుకోకుండా చాలా ప్రయత్నాలే చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలతో ‘మా సీత ఇలా ఉండదు’ అని మెసేజ్ పెట్టేంత.
అయితే ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు అంటే… ఇప్పుడు మనం చూస్తున్న మృణాల్ కాకుండా పాత మృణాల్‌ను చూపించడానికి ఓ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. అది కూడా ఈ మధ్య కాలంలోని మృణాల్‌ను కాదు… ఏకంగా 12 ఏళ్ల క్రితం ఆమె ఎలా ఉండేదో చూపిస్తారట. ఒక వేళ మృణాల్ ఫిల్మోగ్రఫీని మీరు చూసి ఉంటే.. అప్పటి ఆమె అంటే ‘లవ్ సోనియా’ సినిమా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే 2012లో ఆ సినిమానే మొదలైంది కాబట్టి.
మృణాల్ మనకు ఈ మధ్య కాలంలో తెలుసు కానీ… మరారీ, హిందీ సినిమాల్లో ఎప్పటి నుండో ఉంది. ఆమె తొలి సినిమా పదేళ్ల క్రితం మరాఠీలో రిలీజ్ అయ్యింది. అయితే ఆమె తొలి సినిమా ‘లవ్ సోనియా’ 2012లో మొదలైంది. అయితే వివిధ కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ 2018లో రిలీజ్ చేశారు. అందులో మృణాల్ నటనకు చక్కటి అప్లాజ్ వచ్చింది. ఫెస్టివల్స్‌లో పురస్కారలు కూడా దక్కాయి. కానీ థియేటర్ దగ్గర ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతో ఇటీవల మంచి విజయం అందుకున్న ఆమె ‘ఫ్యామిలీ స్టార్’తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా సమ్మర్‌లో వస్తుందని టాక్. అయితే ఈ లోపే ‘లవ్ సోనియా’ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
నిజానికి ఆ సినిమాలో (Mrunal Thakur) మృణాల్ ఠాకూర్‌ను చూస్తే గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ట్వంటీస్‌లో ఆమె ఉన్నప్పుడు నటించిన సినిమా అది. కుటుంబ పరిస్థితుల వల్ల దారుణంగా మోసపోయి దగాపడిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కథ ఆ సినిమా. సినిమా మెయిన్ ప్లాట్ మొత్తం ముంబయి రెడ్ లైట్ ఏరియాలో జరుగుతుంది.