మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కామెంట్స్ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి. మెగా ఫ్యామిలీ గురించి కామెంట్లు చేసే ఆకతాయిలకు నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదని మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదని నాగబాబు అన్నారు. సినిమా ఇండస్ట్రీ మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలది మాత్రమే కాదని కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదని నాగబాబు అన్నారు.
నాగబాబు ఈ విధంగా కామెంట్లు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ మధ్య కాలంలో కొంతమంది మెగా ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, వీళ్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరూ ఉండరంటూ పనికిమాలిన కామెంట్స్ చేసే చాలామందిని నేను చూశానని నాగబాబు తెలిపారు. మాకు అలాంటి భావన లేదంటూ నాగబాబు ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడివి శేష్ (Adivi Sesh) ఇండస్ట్రీలోకి వచ్చి తన కష్టంతో ఎదిగాడని కమిటీ కుర్రోళ్లు మూవీ ఆర్టిస్ట్ లు సైతం ఏ స్థాయికి వెళ్తారో ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయని నాగబాబు వెల్లడించడం గమనార్హం. సరైన కథను ఎంచుకుని నిబద్ధతతో పని చేస్తే సక్సెస్ తప్పకుండా దక్కడం పక్కా అని నాగబాబు తెలిపారు.
కొడితే ఎగిరి ఎక్కడో పడే కంటెంట్ ను ఎంచుకోకుండా యంగ్ జనరేషన్ హీరోలు మంచి కథలపై దృష్టి పెడితే బాగుంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. వరుణ్ తేజ్ (Varun Tej) , అడివి శేష్ కథల ఎంపికలో నచ్చుతున్నారని ఆయన తెలిపారు. సాయితేజ్ (Sai Dharam Tej) సైతం విరూపాక్ష మూవీ నుంచి కథల ఎంపికలో నచ్చుతున్నాడని నాగబాబు పేర్కొన్నారు.