పెళ్లి అయ్యాక తండ్రీ కూతుళ్ల మధ్య దూరం పెరుగుతుందా? మాటలు తగ్గుతాయా? అంటే అవుననే చెప్పాలి. అప్పటివరకు ఇంట్లోనే ఉండే కూతురు.. ఇప్పుడు వేరే ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడి పనుల్లో బిజీ అయిపోతుంది.. తన లోకమైన తన కుటుంబంతో బిజీ అయిపోతుంది. అంతకుముందులా తల్లిదండ్రులతో మాట్లాడటం కుదరకపోవచ్చు. దీనికి మెగా డాటర్ నిహారిక కూడా ఏం అతీతం కాదు. ఈ విషయాన్ని నాగబాబే చెప్పుకొచ్చారు. పెళ్లి అయ్యాక మా మధ్య మాటలు తగ్గాయ్ అని చెప్పారాయన.
‘‘ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకే ఆడపిల్లలంటే నాకు ఇష్టం, గౌరవం. వరుణ్‌తేజ్ పుట్టిన తర్వాత ఒక కూతురు పుడితే బాగుండని అనుకున్నాను. అలానే నిహారిక కూతురిగా మా జీవితంలోకి వచ్చింది. నిహారిక నాకో బెస్ట్ ఫ్రెండ్. నాకు సంబంధించిన ఎన్నో విషయాలను నిహాతోనే పంచుకుంటాను. మా ఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. అయితే పెళ్లయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ నా కూతురు జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు నాగబాబు.
‘‘నిహారిక ఎక్కడున్నా అల్లరి చేస్తుంటుంది. కానీ, వరుణ్ అలా కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో మాత్రమే ఓపెన్‌గా ఉంటాడు. జనాల మధ్యలోకి వెళితే చాలా సైలెంట్’’ అంటూ వరుణ్ తత్వం గురించి చెప్పారు నాగబాబు. వరుణ్ పెళ్లి గురించి చెబుతూ… ‘‘వరుణ్‌ది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది విషయం కాదు. పిల్లలకు మంచి జీవిత భాగస్వామి రావాలనే మేం కోరుకుంటాం. వరుణ్‌ను అర్థం చేసుకునే మంచి అర్ధాంగి రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు నాగబాబు. అంటే ప్రేమ వివాహం కూడా జరగొచ్చనే హింట్ ఇచ్చినట్లయింది. వరుణ్ పెళ్లి విషయంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ని ఫాలో అవుతాడా? చూడాలి.