మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపిన నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టారు.
అలానే 48 గంటల్లో రాజీనామా లేఖను కూడా ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనాలా లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన రాజీనామాకు గల కారణాలను కూడా చెప్పాడు. పక్షపాతం లేకుండా వ్యవహరించే ‘మా’ తీరును ఎప్పుడూ అభిమానించేవాడినని, సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను ‘మా’ అక్కున చేర్చుకునేదని అన్నారు.
కానీ ఈ మధ్యకాలంలో ‘మా’ సభ్యుల్లో అటు నటులుగా ఇటు మనుషుగా అనూహ్యమైన మార్పులొచ్చాయని.. ఈ అసహ్యమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. ఈ ఎన్నికలో తనలాంటి వారికి కనువిప్పు కలిగించాయని.. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని అన్నారు. ఇలాటి కపటవాదులు, దుర్భరమైన సభ్యుల కారణంగానే ఈ అసోసియేషన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రకాష్ రాజ్ లాంటి గౌరవప్రదమైన వ్యక్తి వెంట ఎల్లప్పుడూ నిలబడి ఉంటానని.. ఎప్పటికైనా నా మద్దతు ఆయనకే అని అన్నారు.