పాపం చాలా అంచనాలు ఆశలు పెట్టుకొన్న “శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడంతో 2018 నాగచైతన్యకి ఒక నైట్ మేర్ లా మిగిలిపోయింది. అందుకే 2019ని ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అనువుగా మార్చుకొని సూపర్ హిట్ కొట్టాలని చాలా బలంగా ఫిక్స్ అయిపోయాడు నాగచైతన్య. ఆల్రెడీ తన స్వీట్ వైఫ్ సమంతతో కలిసి నటిస్తున్న “మజిలీ”ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న చైతూ.. తనకు బాగా అచ్చోచ్చిన ఒక లవ్ స్టోరీని తన తదుపరి చిత్రంగా సెలక్ట్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన “బరేలీకి బర్ఫీ” తెలుగు రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడట నాగచైతన్య.
“బరేలీకి బర్ఫీ” చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు కోన వెంకట్ సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తన శిష్యగణంలోని ఒక వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కోన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవ్వనుంది. ఆయుష్మాన్ పోషించిన కవి పాత్రలో చైతన్య కనిపించనున్నాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ రావ్ మరియు హీరోయిన్ పాత్రల కోసం పాత్రధారులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు కోన. నటీనటులను ఫైనల్ చేయగానే సినిమా సెట్స్ కు వెళ్లిపోతుంది. మరి 2019 చైతన్యకి లక్కీ ఇయర్ గా మారుతుందో లేదో చూడాలి.