నటుడిగా నాగార్జునని మన్మధుడు, యువ సామ్రాట్ అని రకరకాలుగా అభిమానులు పిలుచుకుంటారు. కానీ నాగార్జునని ‘కింగ్’ అని అనడం ఎవరు మొదలుపెట్టారోగానీ ఆయన ఆ పేరుకి సార్థకత చేకూరుస్తున్నారు. ఎందుకంటే కేవలం అక్కేనేని నాగేశ్వరరావు గారి వారసుడిగానో, ఒక నటుడిగానో ఆయన పరిమితమవ్వలేదు. ఆయనలో అదిరిపోయే బిజినెస్ మాన్ వున్నారు. అపారమైన తెలివితేటలూ ఆయన సొంతం. ఆ తెలివితేటలే ఆయన్ను ‘కింగ్’ గా మార్చాయని చెప్పొచ్చు. కొత్తవారిలో ప్రతిభని గుర్తించడంతో పాటు, తమ ప్రతిభను నిరూపించుకున్న వారిని పట్టుకోవడంలో ఆయన్ని మించిన ప్రతిభావంతుడు లేడేమో.
గతంలో వీరభద్రం, సుధీర్ వర్మ, కళ్యాణ్ కృష్ణ లాంటి దర్శకులు ఉన్న ఈ జాబితాలోకి తాజాగా మరో దర్శకుడు చేరాడు. అతడే.. ‘పెళ్లిచూపులు’ లాంటి సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకున్న తరుణ్ భాస్కర్. ఈ సినిమా చూసిన నాగ్ తరుణ్ ని ఇంటికి పిలిపించుకుని చర్చలు నడిపారు. అయితే అవి తనకోసం కాదట. తనయుల కోసం. నాగచైతన్య, అఖిల్ లను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ద్ధం చేయమని తరుణ్ కి పురమాయించారట. అయితే ‘పెళ్లి చూపులు’ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించిన సురేష్ బాబు కూడా తరుణ్ తో ఇదే మాట చెప్పారు. రానా, వెంకీలు సరిపడా కథలు రాయమని. అంచేత అక్కడ పనులు పూర్తయితే గానీ అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టలేని పరిస్థితి. చూద్దాం మున్ముందేం జరుగుతుందో.