ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌కి (Saif Ali Khan) సంబంధించింది అంటూ ఓ రూ.15 వేల కోట్ల ఆస్తి గురించి గత కొన్ని ఏళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో కేసులు, కోర్టులు, వాదనలు, వాయిదాలు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్‌కు (Saif Ali Khan) మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగానే పేర్కొనాలని అని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
భోపాల్‌లో సైఫ్ కుటుంబానికి విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. వాటిని ఎనిమీ ప్రాపర్టీగా తీర్మానిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానిని సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తాజాగా కొట్టి వేసింది. అలాగే ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపాలని కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలని, తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈనేపథ్యంలో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత ఏర్పడింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. భోపాల్‌లో సైఫ్ అలీఖాన్ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్ నుండి వారసత్వంగా కొన్ని విలాసవంతమైన భవనాలు వచ్చాయి. భోపాల్ చివరి నవాబు అయినా హమీదుల్లా ఖాన్ కుమార్తెనే సాజిదా. హమీదుల్లా ఖాన్ పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన జరిగినప్పుడు 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. సాజిదా మాత్రం ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు ఇఫ్తిఖర్ అలీఖాన్ (సైఫ్ అలీఖాన్ తాత)ను వివాహమాడారు.
అలా సాజిదాకు ఆమె తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. ఆ తర్వాత ఆమె వారసులైన సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అబీదా పాకిస్థాన్‌కు వలస వెళ్లడం వల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం పదేళ్ల క్రితం అంటే 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్ అలీ ఖాన్ కుటుంబసభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌నే ఇప్పుడు న్యాయమూర్తి తోసిపుచ్చారు.