గల్వాన్ లోయలో భారత సైన్యం, చైనా సైన్యం మధ్య ఓ పోరాటం జరిగింది గుర్తుందా? ఒక్క బులెట్ కూడా వాడకుండా జరిగిన పోరాటం అది. మన సైనికుల వీరత్వం చూసి ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకున్నాయి. అలాంటి ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా (Apoorva Lakhia) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌తోపాటు ‘‘కొన్ని యుద్ధాల్లో గెలవడానికి బుల్లెట్లు అవసరం లేదు’’ అని రాసుకొచ్చారు. ఆ మోషన్ పోస్టర్‌లో సల్మాన్ ఖాన్ సగం ముఖాన్ని మాత్రమే రివీల్ చేశారు. ముఖం మీద రక్తపు మరకలు, దేశభక్తి నిండిన కళ్లతో సల్మాన్ ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు పోస్టర్ రూపొందించారు. చూపించినంతవరకు సినిమా మీద మంచి అంచనాలు పెంచింది. మరి సినిమా ఎలా తెరకెక్కుతుందో చూడాలి.
2020లో లడఖ్ సరిహద్దులోని గల్వాన్ వ్యాలీలో భారత్ – చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. జూన్ 15న జరిగిన ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. గడిచిన 45 ఏళ్లలో భారత్ – చైనా సరిహద్దులో జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా ఇది నిలిచిపోయింది. ఈ అత్యంత క్రూరమైన యుద్ధం ఆధారంగా సినిమా తెరకెక్కుతోందని ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీమ్ ఆ మోషన్ పోస్టర్‌లో రాసుకొచ్చారు. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా భారతదేశంలో జరిగిన యుద్ధమిది.
తుపాకులు లేని యుద్ధం ఏంటి అనుకుంటున్నారా? గల్వాన్ ప్రాంతంలో ఆయుధాల వినియోగంపై నిషేధం ఉంది. దీంతో ఆ రోజు సైనికులు తుపాకీలు వాడకుండా కర్రలు, రాళ్లు, చేతులతోనే యుద్ధం చేసి విజయం సాధించారు. ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆ సంతోష్ బాబు పాత్రలోనే సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడు అనేది సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక డిజాస్టర్ దర్శకుడు, రామ్‌చరణ్ అన్నామేంటి అనుకుంటున్నారా? ఎనిమిదేళ్ల క్రితం రామ్‌చరణ్‌ని, అతని అభిమానుల్ని భయపెట్టిన ‘తుఫాన్’ సినిమా దర్శకుడు ఈ అపూర్వ లఖియానే.