ఓ నటుడి నటన, స్క్రీన్ ప్రజెన్స్, లుక్స్.. ఇలా కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి. చాలా తక్కువమందికే గొంతు ప్రత్యేకంగా నిలుస్తుంది. అప్పుడెప్పుడో ‘సాయి కుమార్ వాయిస్’ అంటూ ఓ బ్రాండ్ ఉండేది. చాలా ఏళ్లుగా ఆయన గొంతుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత కొంతమంది హీరోలు ఉన్నా.. హైలైట్ అయ్యేది ఎక్కువ వారి నటనే. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇటీవల కాలంలో అలాంటి ఘనత అందుకున్న వ్యక్తి అర్జున్ దాస్. ఇటీవల ‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌లో వినిపించిన గొంతు ఆయనదే అని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు.
ఆ ట్రైలర్‌కి గొంతు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ కూడా థ్యాంక్స్ చెప్పారు. చాలా తక్కువమంది ఫేవర్ అడుగుతానని.. నిన్ను అడిగితే చేసినందుకు థ్యాంక్స్ అని పవన్ ఎక్స్‌లో పోస్టు కూడా చేశారు. అయితే పవన్ ఏరి కోరి అడిగేంత ప్రత్యేకత ఉన్న ఆ వాయిస్ ఒకప్పుడు అర్జున్ దాస్ (Arjun Das) కి మైనస్ అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. ఆయనే గతంలో ఈ విషయం చెప్పుకొచ్చారు. చెన్నైకు చెందిన అర్జున్ దాస్ (Arjun Das) స్కూల్ రోజుల్లో డిబేట్‌ల్లో పాల్గొని తన బేస్ వాయిస్‌తో ప్రశంసలు అందుకున్నాడట. అయితే కొంతమంది అతని వాయిస్‌ను అవహేళన చేసేవారట. ‘నీ వాయిస్ వింతగా ఉంది’ అనేవారట.
సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు అర్జున్ దాస్ (Arjun Das) దుబాయిలో జాబ్ చేసేవాడు. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 40 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి చెన్నైకు వచ్చేశాడు. కొన్నాళ్లు రేడియో జాకీగానూ చేశాడు. సినిమాల్లోకి రావాలని దర్శకులను కలిసినప్పుడు అర్జున్ దాస్‌కు రిజక్షన్‌లే ఎదురయ్యాయి. అది కూడా తన వాయిస్ కారణంగానే. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేస్తే 2012లో ‘పేరుమాన్’తో నటుడిగా మారాడు. అయితే తొలి సక్సెస్ రావడానికి 9 ఏళ్లు పట్టింది.
లోకేశ్ కనగరాజ్ తీసిన ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’తో అర్జున్ దాస్ పాపులర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే అతని వాయిస్ బాగా పాపులరైంది. ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి పాత్రకుచ, పవన్ కల్యాణ్ ‘ఓజీ’ గ్లింప్స్‌కు, తమిళ ‘ముఫాసా ది లయన్ కింగ్’లో ‘ముఫాసా’ పాత్రకు గొంతిచ్చాడు. అలా గేళి చేసిన గొంతే ఇప్పుడు స్టార్ అయ్యేలా చేసింది.