గత 3 ఏళ్లలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ సగానికి సగం మూతబడ్డాయి. సరైన సినిమాలు, పెద్ద సినిమాలు రాకపోవడం వల్లే జనాలు థియేటర్ కి రావడం లేదు అనేది ఒకరి మాట. మరోపక్క ఓటీటీలకి జనాలు అలవాటు పడిపోయారు అందుకే థియేటర్లకు రావడం తగ్గించారు అనేది మరో మాట. అయితే మొన్నామధ్య నాగ్ అశ్విన్ వంటి దర్శకులు థియేటర్లలో బీర్ వంటి వాటికి అనుమతి ఇస్తే… జనాలు ఆసక్తిగా సినిమాలకి వస్తారు అని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
తాజాగా మరో చిన్న దర్శకుడు,నిర్మాత అయిన రాజేంద్ర సైతం తన ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రమోషన్స్ లో అదే కరెక్ట్ అన్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ” థియేటర్లలో మద్యం ప్రవేశపెట్టాలి. అప్పుడే జనాలు థియేటర్లకు వస్తారు. మైత్రి శశి గారు, శిరీష్ గారు. దయచేసి నా రిక్వెస్ట్ గురించి ఆలోచించండి. మీరు శుక్రవారం పూట బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఏ థియేటర్ హౌస్ ఫుల్ అవ్వడం లేదు.
కానీ మరోపక్క లిక్కర్ షాపులు, బార్లు మాత్రం ఫిల్ అవుతున్నాయి. జనాలు బార్ కి వెళ్లినా, లిక్కర్ షాప్..లకి వెళ్లినా తెలుగు సినిమా పాటలు, టీవీల్లో సినిమాలే చూస్తున్నారు.టేబుల్ కి 10 వేలు, 20 వేలు పెడుతున్నారు. కాబట్టి.. థియేటర్లలో మందు కనుక ఉంటే కచ్చితంగా వాళ్ళు థియేటర్ కి వస్తారు. తెలంగాణలో పుట్టినరోజుకి,పెళ్ళికి, అన్ని ఫంక్షన్లకు ఆఖరికి చావుకి కూడా మందు పెడుతున్నారు. థియేటర్లలో పెడితే తప్పేంటి. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సెపరేట్ సెక్షన్ పెట్టండి. అప్పుడు వాళ్లకి కూడా ఇబ్బంది ఉండదు.
ఎన్టీఆర్ సినిమాకి కూడా ఆడియన్స్ అరవడం మానేశారు. అదే బీర్, మందు వంటివి అందుబాటులో ఉంటే.. ఆడియన్స్ మనస్ఫూర్తిగా అరుస్తారు. అప్పుడు థియేటర్లలో సినిమాకి ఒక కళ ఉంటుంది. థియేటర్ వ్యవస్థ బ్రతుకుతుంది. కాబట్టి.. థియేటర్లకు లిక్కర్ లైసెన్స్ తీసుకువస్తే థియేటర్లు బ్రతుకుతాయి. కచ్చితంగా మెయింటెనెన్స్ కి డబ్బులు ఎక్కువ అవుతాయి. అయినప్పటికీ థియేటర్ వ్యవస్థ బ్రతుకుతుంది అంటే అది పెద్ద ఇబ్బంది కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.