ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఉంటే ఏదో కొద్దిగా ఉన్న కుర్ర హీరోల లిస్ట్ రాస్తే.. వచ్చే తొలి పేర్లలో నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ కచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరూ ఇప్పుడు కుర్ర స్టార్ హీరోలు అనే పేరు సంపాదించుకున్నారు. విజయ్ ఈ విషయంలో కాస్త ముందున్నా, నవీన్ పొలిశెట్టి ఇప్పుడిప్పుడే ఆ పనిలో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరికీ ఎర్లీ డేస్‌లో జరిగిన కొన్ని విషయాలను ఇటీవల నవీన్ చెప్పుకొచ్చాడు.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ఇటీవల నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత ఎందుకింత ఆలస్యం అంటూ చాలామంది అడిగితే ఇస్తే స్ట్రాంగ్ సినిమా ఇవ్వాలనే ఆలస్యం చేశా అని చెబుతూ వచ్చాడు. అనుకున్నట్లే ఈ సినిమాకు భారీ విజయం అయితే వచ్చింది. నవీన్ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే గతంలో ఆయన ఇలానే హీరో పాత్ర కోసం రెడీ అయితే విలన్ గ్యాంగ్‌లో అసిస్టెంట్ అయిపోయాడట.
నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండకు హీరోగా బ్రేక్ రావడానికి ముందు అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు. ఈ లోపు విజయ్‌కు ‘పెళ్ళిచూపులు’ సినిమా పడి హీరో అయిపోయాడు. నవీన్ మాత్రం ప్రయత్నాల్లోనే ఉండిపోయాడు. ఎట్టకేలకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో కెరీర్ మలుపు తిరిగింది. అయితే నవీన్, విజయ్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. అలా ఎందుకు చేశారు అనే ప్రశ్నలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.
ఆ ప్రశ్నలకు ఇటీవల ఆన్సర్ ఇచ్చాడు నవీన్. నిజానికి నవీన్, విజయ్ ఆ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లింది హీరో వేషాల కోసమే అట. కానీ హీరోలుగా వేరే వాళ్లను ఎంపిక చేసి మాకు క్యారెక్టర్ రోల్స్ ఇచ్చారు అని చెప్పాడు నవీన్. ఆ సమయంలో చాలా బాధ పడ్డామని నవీన్ చెప్పుకొచ్చాడు. అయితే నిరాశపడకుండా వచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చామని, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఇలా హీరోగా ఉన్నామని తెలిపాడు.