కోలీవుడ్‌లో హీరో ధనుష్ (Dhanush), నయనతార (Nayantara) మధ్య జరుగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నయనతార లైఫ్ స్టోరీగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన డాక్యుమెంటరీలో ‘నేను రౌడీనే’ చిత్రానికి చెందిన కొన్ని షాట్లు ఉపయోగించడంతో ఈ వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా తన సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదంపై నయనతార బహిరంగ లేఖతో స్పందించింది. తన ప్రాజెక్ట్‌లో అనవసరపు వివాదం సృష్టించినందుకు ధనుష్ చర్యలు తప్పుబట్టింది.
ఆ వీడియోలు పర్సనల్ లైబ్రరీకి చెందినవి మాత్రమేనని, సినిమా క్లిప్పింగ్స్ కాదని నయన్ (Nayanthara) తరఫు లాయర్లు కోర్టులో వాదనను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా, నయనతార ధైర్యంగా లీగల్ పోరాటానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే, ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. నయనతార, విగ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై తీవ్ర విమర్శలు చేస్తూ, వివాదాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. నయనతార మాత్రం దూకుడు తగ్గించకుండా “ఇది అప్పు అనుకో… వడ్డీతో తిరిగి వస్తుంది” అంటూ పరోక్షంగా ధనుష్‌పై వ్యాఖ్యలు చేయడం వైరల్ అయింది.
అయితే ఆమె భర్త విగ్నేశ్ శివన్ మాత్రం ఈ వివాదంపై నిశ్శబ్దంగా ఉంటూ, అస్సలు స్పందించకుండా ట్విట్టర్ డీయాక్టివేట్ చేశాడు. విగ్నేశ్ శివన్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్రోలింగ్, విమర్శల మోతకు భయపడేలా అతను సోషల్ మీడియా నుంచి తప్పుకున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరైతే “వివాదానికి మధ్యలో ఉండడం ఇష్టం లేకనే విగ్నేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు” అని అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే విగ్నేశ్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ నడుస్తున్న ఈ సమయంలో అనవసరపు ట్రోలింగ్, పిచ్చి విమర్శలతో తన పనిలో ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో అతను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.