కుర్ర హీరోలకు హీరోయిన్ కావాలంటే… ముంబయి వెళ్లి మోడల్‌నో, బడ్డీ హీరోయిన్‌నో తీసుకొస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అదే స్టార్ హీరో, అగ్ర హీరో, సీనియర్ హీరోలకు కావాలంటే సెర్చ్ ప్రాసెస్ మొదలవుతుంది. అదే ఏ రేంజిలో జరుగుతుందంటే పార్టీలో ప్రెసిడెంట్ కోసం జరిగే ప్రక్రియలా ఉంటుంది. చాలా పేర్లు వినిపిస్తాయి, ఆల్‌మోస్ట్ ఓకే అయ్యారు అనుకునేలోపు ‘కాదు కాదు’ అంటూ ఆగిపోతారు. అయితే ఇలాంటి పరిస్థితే ‘చెల్లెలు’ పాత్ర కోసం జరుగుతోందంటే నమ్ముతారా… నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అది కూడా చిరంజీవి లాంటి అగ్ర హీరోకి.
చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయనున్న రెండు సినిమాల్లో చెల్లెల పాత్ర చాలా కీలకం. ‘లూసిఫర్’, ‘వేదాళం’ సినిమాలు చూసినవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. సినిమా మొత్తం ఆ పాత్రకు ముడివేసే ఉంటుంది. దీంతో ఆ రీమేక్‌ల విషయంలో చర్చలు చెల్లెలు పాత్ర దగ్గర నిలిచిపోయాయంట. ‘వేదాళం’లో చెల్లెలు పాత్ర కోసం సాయి పల్లవికి భారీ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైందట. కానీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సినిమాకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఓకే. కానీ ‘లూసిఫర్’లో చెల్లి విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
‘లూసిఫర్’లో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఆఖరికి లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు కూడా వినిపించింది. అయితే అది పుకారు అని మాత్రమే తేలిపోయింది. దీంతో మరికొన్ని పేర్లు తెరమీదకొచ్చాయి. త్వరలోనే చిత్రబృందం ఈ విషయంలో ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. చిరు రీ ఎంట్రీ సమయంలో హీరోయిన్ల కోసం ఇలాంటి చర్చలు జరిగాయి. కాజల్ వచ్చి ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇప్పుడు చెల్లెలు పాత్ర కోసం ఇలాంటి చర్చలు జరగడం గమనార్హం. ఎప్పటికి తేలునో ఈ చెల్లెలి కష్టాలు.