గూగుల్‌లో ఒకసారి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ అని ఇంగ్లిష్‌లోనో, తెలుగులోనూ కొట్టి చూడండి. ఎంచక్కా చక్కటి కేరళ బ్యాగ్రౌండ్‌లో ఇద్దరు హీరోలు ఉన్న పోస్టర్లు కనిపిస్తాయి. ఇప్పుడు అదే గూగుల్‌లో ‘భీమ్లా నాయక్’ అని సెర్చ్ చేయండి. ఎంచక్కా పవన్ కళ్యాణ్ ఒక్కడే పోలీసు డ్రెస్‌లో ఠీవీగా కనిపిస్తాడు. ఇదొక్కటి చాలు పరిస్థితి అర్థం చేయడానికి. ఇప్పుడు మేం చర్చించబోయే టాపిక్ కూడా ఇదే. మలయాళంలో ఇటీవల కాలంలో వచ్చిన కమర్షియల్ హిట్స్‌లో ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ ఒకటి. దాని రీమేక్ చేస్తున్నారు, అందులోనూ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్నారు అనేసరికి హైప్ ఓ రేంజిలో వచ్చింది. కానీ సినిమా ప్రచారం, టైటిల్ మొత్తాన్ని నీరు గార్చేశాయి. ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
పవన్ కల్యాణ్, రానా… ఇద్దరిలో టాప్ హీరో ఎవరు అంటే పవన్ అనే చెబుతారు. అలా అని పవన్ కోసం మరో హీరో పాత్రను తొక్కేయొచ్చా అంటే కాదనే చెప్పాలి. గతంలోనూ మన టాలీవుడ్‌లో చాలా మల్టీస్టారర్‌లు వచ్చాయి. అన్ని సందర్భాల్లోనూ ఒకే తరహా ఫేమ్ ఉన్న హీరోలు కలసి నటించలేదు. కానీ ఆ సినిమాల్లో రెండు పాత్రలను ఎలివేట్ చేసేవారు. టైటిల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ దగ్గరకు వచ్చినప్పటికి ఏమైంది.
సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే పేరు పెడుతున్నారు అనే లీక్‌లు వచ్చినప్పుడే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ వర్గాల్లోనూ అలాంటి చర్చే నడిచింది. అయితే వాటన్నింటిని పట్టించుకోని చిత్రబృందం అదే పేరును ఫిక్స్ చేసింది. ఇప్పుడు రానా పాత్ర డేనియల్ శేఖర్ వీడియో, పోస్టర్‌లోనూ అదే పరిస్థితి. హీరో పాత్రను ఎలివేట్ చేసేలా రానా పాత్రతో చెప్పించారు. ఇదెంతవరకు ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ అనేది అర్థం కావడం లేదు.
రీమేక్ చేసేటప్పుడు మాతృక నుండి కథ తీసుకున్నాం, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పాత్రలు, పాత్రచిత్రణలు సిద్ధం చేసుకున్నాం అని మన దర్శకులు చెబుతుంటారు. ఈ సినిమాకూ అలానే అనొచ్చు. అయితే మల్టీస్టారర్ సినిమాను సింగిల్ స్టార్ చేసేసి, రెండో హీరోను విలన్‌ను చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడో ప్రశ్న మలయాళంలో ఇద్దరు హీరోల పేరు వచ్చేలా టైటిల్ పెట్టారు కాబట్టి… ఇక్కడా అలానే పెట్టాలని రూల్ ఉందా అంటే… అది దర్శకనిర్మాతల ఇష్టమే. కానీ ఇలా మల్టీస్టారర్ సినిమా సింగిల్ స్టారర్ ఎందుకైందో దర్శక్ సాగర్‌చంద్ర చెబుతారా? లేక అన్నీతానై (?) చూసుకుంటున్న త్రివిక్రమ్ చెబుతారా?