Raj Tarun: రాజ్‌ తరుణ్‌కి స్టార్‌ ట్యాగ్‌… ఏమని ఇచ్చారో తెలుసా?

హీరోలకు బిరుదులు ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే ఒకప్పుడు ఇలాంటి బిరుదులు స్టార్‌ హీరోలకు లేదంటే స్టార్‌ అవుతున్న హీరోలకు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలకు, యంగ్‌ హీరోలకు కూడా ఇచ్చేస్తున్నారు. లేదంటే ఇచ్చేసుకుంటున్నారు అనొచ్చు. అలా చాలా ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా, సరైన విజయం పడని ఓ యంగ్‌ హీరోకు ఓ యంగ్‌ నిర్మాత బిరుదు ఇచ్చేశారు. చూస్తుంటే రాబోయే అతని సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో ఆ పేరు పెట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Raj Tarun

యువ హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాడు. తొలి సినిమాలు మంచి విజయం అందుకున్నా.. ఆ తర్వాత ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు అయితే అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీసెంట్‌ కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు కూడా పడ్డాడు. అయినా సినిమాలు చేయడం అయితే ఆపలేదు. అలా ఇప్పుడు ఆయన ‘పాంచ్‌మినార్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్‌ లాంచ్‌ ఇటీవల జరిగింది కూడా.

అక్కడే రాజ్‌తరుణ్‌కు బిరుదు ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత ఎస్‌కెఎన్‌ (SKN). సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్‌ రోల్స్‌లో రాజ్‌ తరుణ్‌ పేరుకు ముందు ‘స్పాంటేనియస్‌ స్టార్‌’ అని పెట్టాలని సూచించాడు. ఆ తర్వాత వచ్చే సినిమాల విషంయలోనూ నిర్మాతలూ కొనసాగించాలని కోరాడు. రాజ్‌ తరుణ్‌ కామెడీ టైమింగ్‌ బాగుంటుందని అందుకే ఆ ట్యాగ్ ఇవ్వాలని కూడా చెప్పాడు.

ఆ మాటలకు రాజ్‌ తరుణ్‌ కూడా స్పందించాడు. ‘మీరు ఏం చెబితే అదే ఫాలో అవుతా’ అని నిర్మాతతో చెప్పేశాడు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీ సింగ్‌ (Rashi Singh) కథానాయిక. త్వరలో సినిమా తీసుకొస్తారట. మరి అందులో టైటిల్‌ కార్డ్స్‌లో ఆ పేరే ఉంటుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus