కొన్ని సినిమాల కథలు కొందరికే సెట్ అవుతాయి. అలా కొన్ని సినిమా టైటిల్స్ కొంతమందికే వర్కౌట్ అవుతాయి. దీని వెనుక కారణం.. గతంలో ఆ సినిమాలో డైలాక్ / పాట ఉండటం. లేదంటే పదే పదే ఎవరో ఒకరు ఆ హీరోకు ఆ పేరు బాగుంటుంది అని పదే పదే చెప్పడం. ఒకసారి పై రెండూ జరిగితే.. ఇక ఆ టైటిల్ ఆయనకే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోతారు. అలా పవన్ కల్యాణ్‌కే బాగుంటాయి అనుకున్న రెండు టైటిల్స్‌లో ఒకటి దూరమైంది, రెండోది ఎవరి కోసం రిజిస్టర్ చేశారో తెలియడం లేదు.
ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ అయిన సినిమా టైటిల్స్ జాబితాను గతంలో ప్రతి నెలా రిలీజ్ చేసేవారు. ప్రొడక్షన్ హౌస్ పేరు చూసుకుని, ఈ టైటిల్ ఈ హీరోదే అనుకునేవారు. అయితే ఇప్పుడు లిస్ట్ రావడం లేదు కానీ, పుకార్ల ద్వారా వివరాలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. అలా రెండు టైటిల్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ‘దేవర’ అయితే, రెండోది ‘సిద్ధార్థ రాయ్’. ఈ రెండు పేర్లు వినగానే పైన మేం చెప్పిందంతా పవన్ కల్యాణ్ గురించే అని మీకు అర్థమైపోతుంది.
నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేశ్ చాలా రోజులుగా పవన్ కల్యాణ్ను ‘దేవర’ అని పిలుస్తూ ఉన్నారు. ఆ పేరును టైటిల్‌గా తన ప్రొడక్షన్ హౌస్ పేరు మీద రిజిస్టర్ చేయించారు కూడా. అయితే ఇటీవల ఆ టైటిల్‌ను కొరటాల శివకు చెందిన వాళ్లు రిజిస్టర్ చేయించుకున్నారని వార్తలొచ్చాయి. ఎన్టీఆర్‌తో కొరటాల త్వరలో చేయబోయే సినిమా కోసమే ఈ పేరు రిజిస్టర్ చేయించుకున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదు.. ఎన్టీఆర్ సినిమా అది కాదు అంటున్నారనుకోండి. కానీ టైటిల్ అయితే బండ్లన్న చేయి దాటిపోయింది. ఇక రెండో ‘సిద్ధార్థ రాయ్’. ఈ పేరు వినగానే.. ‘ఖుషి’ సినిమా గుర్తొస్తుంది.
ఆ సినిమాలో పవన్ పేరు ఇదే. ఇప్పుడు ఈ పేరునే టైటిల్‌గా మైత్రీ మూవీస్ వాళ్లు చెందిన వాళ్లు రిజిస్టర్ చేయించారు అని అంటున్నారు. మామూలుగా అయితే ఈ పేరు పవన్ కల్యాణ్‌కే సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది టైటిల్‌గా కాకుండా.. ఓ స్లోగన్‌లా పవన్ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా అనౌన్స్ చేసి.. ఇంకా స్టార్ట్ చేయలేదు. కాబట్టి ‘సిద్ధార్థ రాయ్’ ఇప్పట్లో కష్టమే. దీంతో ఈ టైటిల్‌ను పవన్ ఫ్యాన్ అయిన వేరే హీరోతో తీస్తారా అనే మాట వినిపిస్తోంది. ఆ లెక్కన ఈ టైటిల్ కూడా పవన్‌కి దూరమైనట్లే అంటున్నారు.