బాలీవుడ్‌లో సినిమా అంటే.. పుకార్లు సహజం అని అంటుంటారు. ఇక్కడ పుకార్లు అంటే.. రిలేషన్‌షిప్ పుకార్లు అని అర్థం. ఇలా షూటింగ్ మొదలైందో లేదో వెంటనే ఆ సినిమాలో నటిస్తున్న హీరో – హీరోయిన్ మధ్యన ఏదో నడుస్తోందని, రిలేషన్‌లో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. వాటికి తోడు ఆ జంట కూడా అలానే బయట షికార్లు తిరగడంతో అవి ఎక్కువవుతాయి. అలాంటి బాలీవుడ్‌లో ఓ సినిమా టీమ్ ‘నో డేటింగ్’ షరతు పెట్టింది అంటే నమ్ముతారా?
అవును ఇది జరిగింది. అయితే ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితం. ఈ విషయాన్ని కథానాయిక నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తెలిపింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమాలతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నిధి అగర్వాల్ రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. ఈ క్రమంలో ఆ సినిమాల విషయాలతోపాటు, కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. అప్పుడే ఈ నో డేటింగ్ విషయం గురించి చెప్పుకొచ్చింది.
‘‘మున్నా మైకేల్’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది నిధి అగర్వాల్. ఆ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారట. అందులో సినిమాకు సంబంధించిన విధి విధానాలతోపాటు.. మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉందట. అదే నో డేటింగ్ రూల్. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో డేట్ చేయకూడదు అనేది ఆ రూల్ సారాంశం. అయితే కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నిధి ఆ విషయం చదవలేదట.
సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్ది రోజుల తర్వాతే ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయిందట. అయితే ఎందుకు అలా రాశారు అని అడగలేద. హీరో – హీరోయిన్లు ప్రేమలో పడితే నటనపై దృష్టి పెట్టరని సినిమా బృందం అనుకొని ఉండొచ్చు అని చెప్పింది నిధి అగర్వాల్. ఆమె చెప్పిందంతా ఓకే కానీ.. బాలీవుడ్‌లో ఇలాంటి రిలేషన్ పుకార్లతోనే సినిమాల ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకలా చేశారబ్బా.