వరుస హిట్లు ఇచ్చే హీరోకి, వరుస ఫ్లాప్‌లు వస్తున్న హీరోకి డిఫరెన్స్ ఏంటి అంటే.. సినిమాల ఎంపిక, వాటిని సెట్స్ మీదకు తీసుకెళ్లడమే అని చెప్పొచ్చు. విజయాలు వస్తుంటే.. కథల ఎంపిక, షూటింగ్ స్టార్ట్ త్వరగా జరిగిపోతుంటాయి. అదే ఫ్లాప్స్ ఉన్న హీరోకు ఈ ప్రక్రియ అంత ఈజీగా సాగదు. ఇలాంటి సిట్యువేషన్‌ను ఫేస్ చేస్తున్న హీరోలు ఎక్కువమందే ఉంటారు. అలాంటి వారిలో నితిన్ ఒకడు. హిట్ ట్రాక్‌లో ఉన్నాడు అనిపించిన నితిన్.. ఇప్పుడు మళ్లీ డౌట్స్‌లో పడుతున్నాడు.
దీంతో సినిమాలు అనౌన్స్ అవుతున్నాయి కానీ, ముందుకెళ్లడం లేదు అనిపిస్తోంది. ‘అ ఆ’ సినిమాతో అదిరిపోయే హిట్ ఇచ్చిన నితిన్ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో విజయం అంటే ‘భీష్మ’ అనే చెప్పాలి. ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఎక్కడో చిన్నపాటి కాన్ఫిడెన్స్ ఏమన్నా తగ్గిందేమో అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. తన ప్రయత్నంగా నితిన్ వరుస సినిమాలు చేస్తున్నా.. మాస్, క్లాస్, ఫ్యామిలీ ..
ఇలా అన్ని జోనర్లను టచ్ చేస్తున్నా.. విజయం దరిచేరడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు హోల్డ్‌లోకి వెళ్లిపోతున్నాయి అని అంటున్నారు. ‘భీష్మ’ సినిమా తర్వాత చూసుకుంటే… ‘చెక్’, ‘రంగ్‌దే’, ‘మ్యాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు వచ్చాయి నితిన్ నుండి. వీటిలో కాస్త బెటర్ అనిపించే సినిమా ‘మ్యాస్ట్రో’ మాత్రమే. మిగిలినవన్నీ ఉసూరుమనిపించినవే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కూడా తేడాకొట్టడంతో నితిన్ కొత్త సినిమాల విషయంలో చాలా ఆలోచనలు చేస్తున్నాడట.
ఈ సమయంలో ఇంకో ఫ్లాప్ వస్తే ఇబ్బంది అని.. అడుగులు జాగ్రత్తగా వేస్తున్నాడట. ఇప్పటికే ‘పవర్ పేట’ పూర్తిగా ఆపేయగా… మిగిలిన సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. నిజానికి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా తర్వాత నితిన్.. వక్కంతం వంశీ సినిమా చేయాల్సి ఉంది. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ సినిమా అనౌన్స్ చేశారు కూడా.
అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే నితిన్ మేకోవర్ కోసమే ఈ వెయిటింగ్ అంటున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో క్లారిటీ వస్తే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో నితిన్‌కి కావాల్సింది కాన్ఫిడెన్స్. అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే కథ, దర్శకుడు ఆయన దగ్గరకొస్తే మరోసారి ‘ఇష్క్’ లాంటి మ్యాజిక్ చేస్తాడు.