సినిమాటోగ్రఫీ చట్టంలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ… ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంది కూడా. దీని వల్ల టాలీవుడ్‌లో ఏ మార్పులు వస్తాయి, టాలీవుడ్ పెద్దలు ఏమంటారు లాంటి వివరాలు పక్కనపెడితే… సినిమా ప్రచారంలో ఓ మార్పు అయితే పక్కాగా కనిపిస్తుంది అంటున్నారు పరిశీలకులు. అదే రిలీజ్ రోజు సాయంత్రం నుండి ఇంకా చెప్పాలంటే తొలి సినిమా ముగిసినప్పటి నుండి బయటకు వచ్చే పోస్టర్లు. ఎలా అంటారా… అయితే చదివేయండి.
ఉదాహరణకు 2020 సంక్రాంతిని తీసుకోండి. మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’ వచ్చాయి. రెండు సినిమాలూ మంచి విజయం అందుకున్నాయి. దీంతో ‘సంక్రాంతి విన్నర్’, ‘బ్లాక్ బస్టర్’ అంటూ కొన్ని పోస్టర్లు, ఒక రోజు అవ్వగానే ‘మా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు, అన్ని కోట్లు’ అంటూ రాసుకొచ్చారు. అక్కడివరకు అందరూ ఆనందించారు. అయితే మొన్నీ మధ్య ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… గతేడాది కొన్ని సినిమాలు చెప్పిన వసూళ్లకు, కట్టిన పన్నుకు సంబంధం లేదు అని అన్నారు.
పెద్దాయన దాసరి నారాయణరావు ఉన్నప్పుడు వసూళ్ల లెక్కల విషయంలో ఓ మాట అనేవారు. చెప్పిన లెక్కలు అన్నీ కరెక్ట్ అనుకుంటే మీ ఇష్టం. అప్పుడు అభిమానుల్లో ఉత్సాహం కోసం, థియేటర్లకు జనాలకు రప్పించడం కోసం ఇలా రాస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ చట్టం అమల్లోకి వస్తే.. వసూళ్ల లెక్కల్లో పారదర్శకత అయితే వస్తుంది. దొంగ లెక్కలు చెప్పి… బయట ప్రచారం చేస్తే… ప్రభుత్వం పన్ను లెక్కలు అడుగుతుంది. దీంతో ఇకపై బ్లాక్ బస్టర్ అంటూ వసూళ్ల లెక్కలు చెప్పే పోస్టర్లు ఇకపై రాకపోవచ్చు అంటున్నారు పరిశీలకులు. చూద్దాం మన సినిమా వాళ్లు ఏం చేస్తారో.