సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రజినీకాంత్ జనవరిలో పొలిటికల్ పార్టీని ప్రకటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలను 31వ తేదీన ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమ్మలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్న సూపర్ స్టార్.. తను ఒప్పుకున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. సినిమా కంప్లీట్ చేస్తే.. పూర్తిగా రాజకీయాల్లో బిజీగా అవ్వాలనుకున్నారు.
దీనికోసం అహర్నిశలు పని చేయడంతో ఆయన అస్వస్థత గురయ్యారు. దీంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా..? లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని కోరారు.
రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని అన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ లెటర్ లో తను ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టడం లేదో కారణాలను వివరించారు.150 నుండి 160 మందిపాల్గొన్న తన సినిమా షూటింగ్ లోనే కరోనా కేసులు వచ్చాయంటే.. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎక్కువ కేసులు వచ్చే ప్రమాదం ఉందని.. దాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది తన ఒక్కడికే సంబంధించిన విషయం కాదని.. వేల, లక్షల మందితో ముడిపడి ఉందని అందుకే పార్టీ పెట్టడం లేదని అన్నారు.