‘కాంచన’ (Kanchana) సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని భయపెడుతూనే, కడుపుబ్బా నవ్విస్తుంటారు కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ఇప్పటికి ఈ సిరీస్‌లో సినిమాలతో మూడుసార్లు వచ్చి భారీ విజయాన్నే అందుకున్నారాయన. అందుకే సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి నాలుగోసారి ‘కాంచన’ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రోజులుగా సాగుతున్న ఈ ప్రయత్నాల్లో ఓ పెద్ద అడుగు ఇటీవల పడింది. ఇప్పుడు ఆ సినిమా గురించి మరో పెద్ద పుకారు బయటకు వచ్చింది.
లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా తెరకెక్కించనున్న చిత్రంగా ‘కాంచన 4’ (Kanchana 4 ) ఉండనుంది. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు, ఆశ్చర్యకర అంశమూ లేదు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారు అని చాలా రోజులుగా చెబుతున్నారు. ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డేను (Pooja Hegde) ఫైనల్ చేశారని వార్తలొచ్చాయి. ఇప్పుడు రెండో హీరోయిన్‌ని కూడా ఓకే చేశారని టాక్. సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ నాయిక, ఐటెమ్ సాంగ్‌ల స్పెషలిస్ట్ నోరా ఫతేహిని (Nora Fatehi) ఎంపిక చేసినట్లు కోడంబాక్కం వర్గాల సమాచారం.
ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో వరుస అనౌన్స్‌మెంట్లతో సినిమాను ఓ లెవల్‌లో ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఇక నోరా ఫతేహి ఈ సినిమా ఒప్పుకుంటే ఎలాంటి పాత్రలో కనిపించనుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మామూలుగా ‘కాంచన’ హీరోయిన్లు అందంతో అలరిస్తారు, కాస్త భయపడి కుర్రాళ్లకు తెగ ముద్దొచ్చేస్తారు.
మరి ఈ సినిమాలో పూజా హెగ్డే భయపెడుతుంది అని ఇంతకుముందే లీకులు వచ్చాయి. ఇప్పుడు నోరా ఫతేహి ఏం చేస్తుంది అనేదే ప్రశ్న. పూజలా భయపడుతుందా? లేక భయపెడుతుందా అనేది చూడాలి. ఆరేళ్ల క్రితం ‘కాంచన 3’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత నుండి నాలుగో ‘కాంచన’ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ ‘ఆదిగరమ్’, ‘బెంజ్’, ‘కాల భైరవ’, ‘బుల్లెట్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవయ్యాక ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తారట.