‘భారతీయుడు’ సినిమా అప్పుడెప్పుడో వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. ఇప్పుడు వస్తే మాత్రం రాజకీయ, మనోభావాల ఊబిలో చిక్కుకుపోయేది. అందులో చర్చించిన అంశాలు అంత వేడిగా ఉంటాయి మరి. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ రావడానికి సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమాలో ఎలాంటి పాయింట్లు డిస్కస్ చేయబోతున్నారు అనే చర్చ చాలా రోజులుగా కొనసాగుతోంది. అయితే ఇందులో కొత్త పాయింట్ ఒకటి బయటకు వచ్చింది. అదే నార్త్ పాలిటిక్స్. అవును ఉత్తరాది రాజకీయాలే.
తమిళనాట చాలా ఏళ్లుగా వినిపిస్తున్న చర్చ నార్త్ పాలిటిక్స్. తమిళ నేతలు చాలా ఏళ్లుగా నార్త్ పాలిటిక్స్ అంటే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమాలోనూ అదే విషయమై చర్చించబోతున్నారా? కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే అవును అనే అనాల్సి ఉంటుంది. తొలి సినిమాలో అవినీతి, లంచం అంశాలను ప్రస్తావించిన భారతీయుడు.. ఈసారి వాటితోపాటు నార్త్ పాలిటిక్స్ అనే అంశం గురించి మాట్లాడతాడు అని చెబుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలో ఇది సాధ్యమా అనేది ప్రశ్న.
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో నార్త్ నుండి వచ్చి దేశాన్ని ఏలుతున్న నాయకులపై, సౌత్ ఇండియాపై, ఇక్కడి ప్రజలపై చిన్నచూపు చూస్తారని ఈ సినిమాలో చూపించబోతున్నారని అంటున్నారు. అలా నార్త్ నాయకులు స్వార్ధపూరిత నిర్ణయాల వల్ల సౌత్ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది చూపిస్తారు అని అంటున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ వీటితో కాస్త స్పష్టత వస్తుందని అంటున్నారు.
‘ఇండియన్ 2’ (Indian2) సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆగస్టు నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. చాలా కాలం క్రితమే ఈ సినిమా మొదలైన వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ‘విక్రమ్’ సినిమా విజయం తర్వాత రీస్టార్ట్ అయ్యింది.