Paradise: విలన్ల కౌంట్ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?
- January 27, 2026 / 12:10 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమాల్లో మా సినిమా ఇంకో లెక్క.. అనేలా ఉంటుంది అని ‘ప్యారడైజ్’ సినిమా టీమ్ చాలా రోజులుగా చెబుతోంది. నానిని ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా పాత్ర ఉంటుందని, కథ – కథనం కూడా అలానే ఉంటాయని చెబుతూ వస్తున్నారు. ఏదో సినిమా గురించి గొప్పగా చెప్పాలి కాబట్టి అలా చెబుతున్నారు అని అనుకోవచ్చు అని కొందరు లైట్ తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఈ విషయం ఓసారి గుర్తు చేస్తే సినిమా సత్తాను కాస్త ఊహించొచ్చు. అదే ఈ సినిమాలోని విలన్లు.
Paradise
కావాలంటే మీరే ఈ సినిమా కాస్టింగ్ చూడండి. రోజురోజుకు ఈ సినిమాలో విలన్ల బలం పెరిగిపోతుంది. నెగిటివ్ రోల్స్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంచుకుంటున్న నటులు సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నారు. ఈ సినిమా మెయిన్ విలన్ రోల్‌లో మోహన్‌బాబును ఎంపిక చేసి షాక్ ఇచ్చారు దర్శకుడు. ఇక బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ ఈ సినిమాలో ప్రధాన విలన్లలో ఒకరిగా నటిస్తున్నారు. ‘కిల్’ సినిమాలో ఆయన క్రూరమైన విలనిజాన్ని చూసి కోపం తెచ్చుకోనివాళ్లు లేరు.

ఈ ఇద్దరే అనుకుంటే సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కూడీ ఈ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని తేలింది. చాలా ఏళ్ల తర్వాత పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నాను అని తనికెళ్ల భరణి ఈ సినిమా గురించి చెబుతూ మాట్లాడారు. తనికెళ్ల భరణి తన కెరీర్ ప్రారంభంలో విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు ‘ప్యారడైజ్’తో తనలోని విలనిజాన్ని బయటకు తీయబోతున్నారన్నమాట. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమాలో నాని ఓ పాత్ర/ పార్శ్వం విలన్‌లానే ఉంటుందట.
‘దసరా’ సినిమాలో విలన్ల విషయంలో శ్రీకాంత్ చూపించిన శ్రద్ధ మనకు తెలుసు. ఆ లెక్కన ఇప్పుడు ‘ప్యారడైజ్’లో కూడా అలాంటి పాత్రలు చూడబోతున్నాం. మార్చి 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. ఆ టైమ్‌కి పనులు పూర్తవ్వవు అని ఓ టాక్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.













