కొన్ని సినిమాలు ఏ లాంగ్వేజ్‌లో వచ్చినా చూడాలని అనిపిస్తుంటుంది. భాష అర్థం కాకపోతే భావమైనా తెలుస్తుంది కదా అని చూసేస్తుంటారు. అలాంటి కొన్ని సినిమాల్లో ‘ఓఎంజీ’ సిరీస్ ఒకటి. ఓఎంజీ అంటే ఓ మై గాడ్ . అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్‌లో రెండు సినిమాలు వచ్చాయి. తొలి సినిమా మనకు ‘గోపాల గోపాల’గా వచ్చి మెప్పించింది. అయితే రెండో పార్టు ‘ఓఎంజీ 2’ (OMG 2) మనకు రాలేదు. దీంతో ఆ సినిమాను కొంతమంది హిందీలోనే చూసేశారు.
అయితే, ఆ సినిమా వచ్చిన ఎనిమిది నెలలకు తెలుగులోకి తీసుకొచ్చారు. అయితే అది ఓటీటీలో కావడం గమనార్హం. అక్షయ్ కుమార్, పంజక్ త్రిపాఠి(Pankaj Tripathi) , యామి గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓఎంజీ 2’. 2012లో వచ్చిన ‘ఓఎంజీ’ సినిమాకు ఇది సీక్వెల్. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే అది కేవలం హిందీలో మాత్రమే. ఇతర భాషల వీక్షకుల కోసం జియో సినిమా ఆ సినిమా రీజనల్ లాంగ్వేజ్‌ల్లో తీసుకొచ్చింది.
తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ‘ఓఎంజీ 2’ సినిమాను అనువాదం చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను 4కెలో కూడా వీక్షించవచ్చు. అయితే దీని కోసం జియో కాస్త రుసుము వసూలు చేస్తోంది. జియో సినిమా ప్రీమియంలో సింగిల్, మల్టిపుల్ డివైజ్ యాక్సెస్ ప్యాక్‌లు తీసుకొచ్చింది. నెలకు రూ.29తో సింగిల్ డివైజ్‌లో… ఇక రూ.89తో మల్టిపుల్ డివైజుల్లో సినిమాలను క్వాలిటీతో వీక్షించొచ్చు. ఇక సినిమా కథేంటంటే.. కాంతి శరణ్ ముగ్దల్ (పంకజ్ త్రిపాఠి) ఓ ఆలయం పక్కనే పూజా స్టోర్‌ను నడుపుతుంటాడు.
మహా శివ భక్తుడు కూడా. ఒకరోజు శరణ్ తనయుడు వివేక్ అసభ్య ప్రవర్తన కారణంగా పాఠశాల నుండి బహిష్కరించేస్తారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో పరువు పోయిందని ముగ్దల్ కుటుంబం ఊరు నుండి వెళ్లిపోవాలనుకుంటుంది. అయితే ఆ సమయంలో దేవదూత (అక్షయ్‌కుమార్) ప్రత్యక్షమవుతాడు. ముగ్దల్ కుమారుడు చేసిన పనికి భయపడుతూ పారిపోకుండా పోరాటం చేయాలని సూచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ.