దిల్ రాజు ప్లానింగ్ పక్కాగా ఉంటుంది, డెసిషన్ కూడా పక్కాగానే ఉంటుంది, థాట్స్ కూడా పక్కాగానే ఉంటాయి. అందుకే సినిమా నిర్మాణంలో ఫ్లాప్‌ల శాతం తక్కువగా ఉంటుంది. అయితే దిల్ రాజు ఈ టాలెంట్ సినిమా నిర్మాణం కంటే ముందే అంటే సినిమా పంపిణీ రంగంలోనూ చూపించారు. నైజాం ఏరియాలో పంపిణీదారుల్లో దిల్ రాజు ఏకచత్రాధిపత్యం నడిపిన రోజులున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంలో ఆయన వెనుకబడ్డారనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తిరిగి పుంజుకున్నారని సమాచారం.
నైజాం ఏరియాలో దిల్ రాజు చాలా రోజులుగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే, కొత్త హీరోల సినిమాలనూ పంపిణీ చేస్తూ వచ్చారు. నిర్మాతగా మారాక కూడా ఆయన పంపిణీ రంగాన్ని విడిచిపెట్టలేదు. అయితే కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో విడుదలవుతున్న హిట్ సినిమాలు వరంగల్ శ్రీను ఖాతాలోనివే. దీంతో నైజాంలో దిల్ రాజు వెనుకబడ్డారా అనే ప్రశ్న మొదలైంది. అయితే నాతో మామూలుగా ఉండదు అంటూ దిల్ రాజు బౌన్స్‌బ్యాక్ అయ్యారు.
వరుసగా సినిమాల పంపిణీ హక్కులు కొనుగోలు చేస్తూ… నైజాంలో ఆధిపత్యం నాదే అని చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఉన్న సినిమాల వివరాలు చూస్తే… ‘రాధే శ్యామ్’, ‘భీమ్లా నాయక్’, ‘అఖండ’ లాంటి పెద్ద సినిమాలున్నాయి. ఇవి కాకుండా ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలను కూడా తనే పంపిణీ చేస్తున్నారట. వీటి ఫలితం మాట పక్కనపెడితే… పెద్ద సినిమాలు ఆయన దగ్గర ఉండటం విషయమే కదా.