సంక్రాంతి సీజన్‌కు రెండు సినిమాలే విడుదల కావాలని ఇండస్ట్రీ పెద్దలు గట్టిగా అనుకుంటున్నట్లు ఉన్నారు. అందుకే సీజన్‌లో వచ్చే మొదటి సినిమా, ఆఖరి సినిమాను వదిలేసి మధ్యలోని సినిమాను తప్పించాలని చూస్తున్నారు. అయితే ఇదంతా ఇండస్ట్రీ మంచి కోసమే అనేది మరచిపోకూడదు. సంక్రాంతి సీజన్‌కు మూడు పెద్ద సినిమాలు వస్తే ఇబ్బందే కదా. అందుకే ఇలా చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి సంధి ప్రయత్నాల్లోకి దిల్ రాజు దిగారని సమాచారం.
సంక్రాంతి రిలీజ్ అంటూ తొలుత ప్రకటించిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. అయితే ఆ తర్వాత సంక్రాంతికి వారం ముందు వచ్చేస్తాం అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం చెప్పింది. అప్పటికే సంక్రాంతి అంటూ జనవరి 13 అంటూ డేట్ ఇచ్చిన ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1కి వెళ్లిపోయింది. కానీ ‘భీమ్లా నాయక్’ మాత్రం వెళ్లలేదు. పదే పదే వాయిదా పుకార్లు వినిపిస్తూ కాదని టీమ్ ఖండిస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ వాయిదా ప్రయత్నాలు సాగుతున్నాయట.
ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌తో దిల్ రాజుకు మంచి అనుబంధమే ఏర్పడింది. దీంతో ఆయన్ను మళ్లీ ముందుకు తెస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు ‘భీమ్లా..’ రాకుండ చూడాలని త్రివిక్రమ్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో దిల్ రాజు సంధి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయంలో వారి నుండి సానుకూల సమాధానమే వచ్చిందని సమాచారం. అయితే ఇదంతా దిల్ రాజు ఎందుకు చేస్తున్నారు అనేగా డౌట్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను నైజాంలో రిలీజ్ చేసేది ఆయనే కాబట్టి.