ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకోవడానికి యువ హీరోలు ఎంతటి సాహసం చేయడానికైనా తెగిస్తున్నారు. రిస్కీ షాట్లను కూడా డూప్‌లను పెట్టుకోకుండా చేసేస్తున్నారు. ఒకరిద్దరు కాదు చాలామంది స్టార్ హీరోలు, కుర్ర హీరోలు చేస్తున్న పని ఇదే. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడి, సినిమాలకు విరామం ఇవ్వాల్సి వస్తోంది. ఇలాంటి కథానాయకుల్లో విశాల్ ఒకడు. మాస్ హీరోగా తనను నిరూపించుకున్న విశాల్… తరచుగా ఇలాంటి సాహసాలు చేసి గాయపడుతున్నాడు. తాజాగా మరోసారి గాయపడ్డాడు.
విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరించారు. అందులో ఓ బిల్డింగ్‌లో ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్‌కి దూకాలి. ఆ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు కారణంగా విశాల్ గాయపడ్డాడు. చేతికి హెయిర్‌లైనర్ గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతోపాటు గాయాల నుండి కోలుకోవడానికి కేరళ వెళ్తున్నట్లు కూడా చెప్పాడు.
ప్రస్తుతం విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నా. మార్చి తొలివారంలో సినిమా తుదిదశ షెడ్యూల్‌లో పాల్గొంటా అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు విశాల్. ఈ వీడియోలో విశాల్ పోలీసు అధికారిగా కనిపించాడు. ఓ బాలుడ్ని రక్షించే సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ కథతో ఎ. వినోద్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయికగా చేస్తోంది. విశాల్ నుండి ఇటీవల వచ్చిన ‘సామాన్యుడు’ చిత్రీకరణలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.
ఆ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో విశాల్‌ను విసిరే సీన్ తీస్తున్నారు. అప్పుడు కూడా పొరపాటున పట్టు తప్పి విశాల్ గోడకు గుద్దుకున్నాడు. దీంతో ఇక తర్వాత జాగ్రత్తపడతారేమో అని అనుకున్నారంతా. కానీ మళ్లీ ప్రమాదం జరిగింది. సో. విశాల్ ప్లీజ్ టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ వెల్ సూన్.