తెలుగు సినిమాకు తెలుగులోనే పేరు పెట్టాలని మనం ఎప్పుడూ అనలేదు. ఇంగ్లిష్‌లో పేరు పెట్టినా చూస్తున్నాం, హిట్ చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఆ పేరుకు తెలుగులో ఓ అర్థం, వివరణ ఉంటాయి కాబట్టి. అలా అని తమిళంలో తెరకెక్కిన సినిమాను ఇక్కడకు డబ్బింగ్ చేసి తీసుకొస్తున్నప్పుడు అదే పేరుతో రిలీజ్ చేస్తాం అంటే ఎలా? గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు మరోసారి బయటకు వచ్చింది. దీనికి కారణం రజనీకాంత్ (Rajinikanth) కొత్త సినిమా.
Tollywood
ఒకప్పుడు తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తే.. తెలుగు టైటిళ్లు పెట్టేవారు. తెలుగు డైలాగులు, పాటలు రాయించుకునేవారు కూడా. తమిళ సినిమాల తెలుగు వెర్షన్ పాటలు మాతృక కంటే బాగున్నాయనే మాటలు కూడా ఒకప్పుడు వినేవాళ్లం. ఈ క్రమంలోనే ‘ఘర్షణ’ (Gharshana) , ‘సఖి’ (Sakhi), ‘యువ’ (Yuva) , ‘చెలియా’ (Cheliya), ‘మెరుపు కలలు’, ‘ప్రియురాలు పిలిచింది’ (Priyuralu Pilichindi) , ‘ఇద్దరు’ (Iddaru) .. లాంటి ఎన్నో టైటిల్స్ చూశాం. ఆ సినిమాలను ఆదరించాం. అంతెందుకు మొన్నీమధ్యే ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చూశాం.
అలాంటి మన దగ్గర ఇప్పుడు ‘వలిమై’, ‘రాయన్’ (Raayan) , ‘కంగువ’ (Kanguva) , ‘వేట్టయన్’ (Vettaiyan) అంటూ అచ్చం తమిళ పేర్లను తెలుగులో రాసేసి విడుదల చేసేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ‘వేట్టయన్’కు ‘వేటగాడు’ అని పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ ఆ పేరు లేకపోతే వేరేది ట్రై చేయొచ్చు కదా అనే డిస్కషన్ నడుస్తోంది టాలీవుడ్‌లో. తెలుగు వాళ్లంటే, తెలుగంటే వాళ్లకు గౌరవం లేదా? కేవలం మన దగ్గర వసూళ్లు మాత్రమే కావాలా అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా.
ఈ క్రమంలో తెలుగులో (Tollywood) తెలుగు పేరుతో తీసే సినిమాలను అదే పేరుతో తమిళంలో రిలీజ్ చేస్తే చూస్తారా అనేది మాట వినిపిస్తోంది. అయితే మనం ఏ పేరు పెట్టినా తమిళంలో ఆదరించడం లేదు కదా అని కొంతమంది ‘దేవర’ (Devara) సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా అక్కడ సరైన రెస్పాన్స్ లేదు.