ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేయడం లేదు కానీ.. టాప్ సంగీత దర్శకుల లిస్ట్‌లో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పేరు ఇంకా ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే చేస్తున్నవి తక్కువ సినిమాలే అయినా.. పెద్ద సినిమాలు చేస్తుండటం, ఆ పాటలు పెద్ద విజయం అందుకుంటుండటమే కారణం. దాదాపుగా టాలీవుడ్‌లో అందరు టాప్ హీరోలతో పని చేసిన ఆయన ఫ్యామిలీ నుండి మరో సంగీత దర్శకుడు వస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఇప్పుడు స్వరకర్తగా మారబోతున్నారట.
సాగర్ గురించి ఇప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం ఉంది. ఆయన మంచి గాయకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమాల్లో మంచి పాటలు పాడారు కూడా. ‘వర్షం’ (Varsham) సినిమాలోని ‘నీటి ముల్లే..’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లోని (Mr. Perfect) ‘ఆకాశం బద్ధలైనా..’, ‘బొమ్మరిల్లు’ (Bommarillu) సినిమాలోని ‘నమ్మక తప్పని నిజమైనా..’, ‘ఇద్దరమ్మాయిలతో’ (Iddarammayilatho) సినిమాలో ‘టాపు లేచిపోద్ది..’, ‘నేను శైలజ’ (Nenu Sailaja) సినిమాలో ‘శైలజా.. శైలజా..’ లాంటి ఎన్నో విజయవంతమైన పాటలు ఆలపించారాయన.
ఇన్ని పాటలు పాడుతున్నా, వాటికి అవార్డులు వస్తున్నా ఎప్పటి నుండో ఉన్న మ్యూజిక్ డైరెక్షన్ అవ్వాలనే కోరికను ఇప్పుడు తీర్చుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో ఓ అగ్ర హీరో సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం దక్కింది అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు బయటకు వస్తాయి అని సమాచారం. అయితే ఇప్పటికే సాగర్ ఓ షార్ట్ ఫిల్మ్‌కు సంగీతం అందిచి ఉన్నారు. ‘కచ్చే దిన్’ అనే హిందీ లఘు చిత్రానికి సంగీతం అందించారు. మరిప్పుడు సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తారు? అన్నను మరిపిస్తారా? అనేది చూడాలి.
అన్నట్లు దేవిశ్రీప్రసాద్ లాగే సాగర్ కూడా అప్పుడప్పుడు పాటలు రాస్తుంటారు. ఇప్పటివరకు అలా రెండు పాటలు రాశారు కూడా. ‘నేను శైలజ’ సినిమాలో ‘దిస్ నైట్ ఈజ్ స్టిల్ యంగ్’, ‘లైగర్’ (Liger) సినిమాలో ‘లైగర్ హంట్ థీమ్..’, ‘అక్డి పక్డి’ (తమిళం) పాటలు రాశారు. మరి తొలిసారి మ్యూజిక్ డైరక్షన్ చేస్తున్నప్పుడు కూడా రాస్తారేమో చూడాలి.