థియేటర్లలో విడుదల చేయలేని, చేసే అవకాశం లేని సినిమాలు ఓటీటీకి వెళ్లిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలా వరుసగా ఓటీటీ డీల్స్ కుదిరిపోతున్నాయి. అలా గోపీచంద్‌కి సంబంధించి రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీ దగ్గర ఆగాయని సమాచారం. అందులో ఒకటి ఎప్పుడో రెండేళ్ల క్రితం సిద్ధమైతే, ఇంకొకటి ఆరు నెలల క్రితం రెడీ అయ్యింది. అయితే ఈ రెండింటి పరిస్థితి ఒక్కోలా ఉండటం గమనార్హం. ముందుగా ఓటీటీ అవకాశం సిద్ధంగా ఉండి…
నిర్మాణ సంస్థ దగ్గర ఆగిన సినిమా చూద్దాం. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేసిన సినిమా ‘సీటీమార్’. తమన్నా నాయికగా నటించిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే సినిమా విడుదలకు సిద్ధమైంది. అందుకే తాజాగా చిత్రబృందం దగ్గరకు ఓ ఓటీటీ సంస్థ బేరానికి వచ్చింది. వారి డీల్‌కు ఒప్పుకుంటే నిర్మాతకు ఐదారు కోట్ల రూపాయల లాభం వస్తుందంటున్నారు. అయితే ఈ విషయంలో గోపీచంద్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక నిర్మాత ముందుకొచ్చి… ఓటీటీలు తేల్చని సినిమా గురించి చూస్తే… బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ – నయనతార కలసి నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. రెండేళ్ల క్రితమే పూర్తయిన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఇప్పటికీ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య ఓటీటీ ఆఫర్ వచ్చినా నిర్మాతలు కాదనుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీకి ఇస్తామన్నా… డీల్ కుదరడం లేదంటున్నారు. ఇదీ గోపీచంద్ సినిమాల పరిస్థితి.