మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మరో వారం ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ ఎన్నికల విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మా’ ఎన్నకల్లో ఎంత మంది పోటీలో ఉన్నా… అధ్యక్ష ఎన్నికకు జరిగే పోటీలో ఉన్న కిక్కే వేరు. అందుకు తగ్గట్టే ఈ ఏడాది ‘మా’ ఎన్నికల సీజన్ వచ్చేసరికి పోటీదారులు సిద్ధమైపోయారు. ఈ సారి ఏకంగా ఐదుగురు పోటీలో నిలబడతాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇద్దరే మిగిలారు.
‘మా’ ఎన్నికలు జరుగుతాయి అంటూ… వార్తలు వస్తుండగానే ప్రకాశ్‌రాజ్ ‘నేనొస్తున్నా’ అంటూ ముందుగా ప్రకటించేశారు. దీంతో వేడి మొదలైంది, ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ‘మేమూ వస్తాం’ అంటూ కొన్ని పేర్లు బయటకొచ్చాయి. అలా మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు ముందుకొచ్చారు. అయితే పోటీలో ఇంతమంది ఉండకపోవచ్చు అనే వార్తలే వచ్చాయి. అనుకున్నట్లే జరిగింది. రకరకాల వార్తలు, చర్చల అనంతరం ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మాత్రమే నిలిచారు.
పోటీలో ఉంటా అంటూ తొలుత హేమ చెప్పినా… తర్వాత ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో వైస్ ప్రెసిడెంట్ కోసం బరిలో నిలిచారు. . ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో చేరిపోయి జనరల్ సెక్రటరీ బరిలో జీవిత నిలిచి… అధ్యక్ష ఎన్నికలో నిలబడటం లేదని తేల్చేశారు. సీవీఎల్ నరసింహారావు అయితే నామినేషన్ వేసి, మేనిఫెస్టో విడుదల చేసి మరీ.. నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇదీ ఐదుగురుతో మొదలై… ఇద్దరే మిగిలిన లెక్క. అసలు లెక్క అక్టోబరు 10న జరుగుతుంది. అదే ఎన్నికలు.